Lok Sabha Election 2024: మహారాష్ట్రలో ఆసక్తికర పోటీ! పవార్ కుటుంబం నుంచి బరిలోకి వదిన-మరదళ్లు, పవార్ కుటుంబాన్ని అంత చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సుప్రియా సూలే మండిపాటు
సునేత్రను బరిలోకి దించడం అభివృద్ధి కోసం కాదు. శరద్ పవార్‌ను రాజకీయంగా అంతం చేసేందుకే. ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత కూడా ఈ మాట అన్నారు. రాష్ట్రంలో కమలదళానికి బలమైన అభ్యర్థులు లేరు.
Pune, March 31: శరద్ పవార్ (Sharad Pawar)ను రాజకీయంగా అంతమొందించడమే లక్ష్యంగా బారామతిలో ‘కుటుంబ పోరు’ జరిగేలా బీజేపీ (BJP) కుట్ర పన్నిందని సుప్రియా సూలే (Supriya Sule) ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఈ స్థానం నుంచి మరోసారి బరిలో దిగిన సుప్రియాపై.. ఆమె సోదరుడు అజిత్ పవార్ సతీమణి సునేత్ర పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే.. ఆమె తనకు తల్లితో సమానమని, ప్రస్తుత పరిణామాలు ఆమె పట్ల తనకున్న గౌరవాన్ని తగ్గించవని సూలే స్పష్టం చేశారు.
‘‘పవార్ కుటుంబానికి, మహారాష్ట్రకు వ్యతిరేకంగా బీజేపీ ఈ కుట్ర పన్నింది. సునేత్రను బరిలోకి దించడం అభివృద్ధి కోసం కాదు. శరద్ పవార్‌ను రాజకీయంగా అంతం చేసేందుకే. ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత కూడా ఈ మాట అన్నారు. రాష్ట్రంలో కమలదళానికి బలమైన అభ్యర్థులు లేరు. కాబట్టే, నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. మరాఠీ మాట్లాడే ప్రజల మధ్య చీలికలు సృష్టించేందుకు యత్నిస్తోంది. సైద్ధాంతికపరంగా సాగే మా పోరును వ్యక్తిగతం చేసింది’’ అంటూ బీజేపీపై సూలే విరుచుకుపడ్డారు.
శరద్ పవార్ కుటుంబానికి పట్టున్న స్థానం బారామతి. 2009 నుంచి సుప్రియ ఇక్కడ ఎంపీగా ఉన్నారు. మరోవైపు.. అజిత్ 1991 నుంచి బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు సోదరి విజయంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ప్రస్తుతం కుమార్తె తరఫున శరద్ పవార్ సైతం రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ.. సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా మే 7న ఈ స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు.