Godavari Boat Tragedy Update: 37 రోజుల తర్వాత బయటపడిన రాయల్ వశిష్ట, సెప్టెంబర్ నెలలో గోదావరి నదిలో మునిగిపోయిన బోటు వెలికితీత, మృతదేహాల కోసం ఆత్మీయుల ఎదురుచూపులు
మరో 12 మంది ఆచూకీ తెలియ రాలేదు. కాగా, 2 మృత దేహాలు లభ్యమైనట్లు తెలుస్తుంది. గల్లంతయిన మిగతా మంది అచూకీ వివరాలు తెలిసే అవకాశం ఉంది....
Devi Patnam, October 22: దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి (Royal Vasista) బోటు ఎట్టకేలకు 37 రోజుల తర్వాత బయటకు వచ్చింది. ధర్మాడి సత్యం బృందం (Dharmadi Sathyam)తో పాటు స్కూబా డైవర్స్ (Deep Sea Scuba Divers) తీవ్రంగా శ్రమించి బోటును బయటకు తీయగలిగారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత విషాదాన్ని నింపిన బోటు మునక ప్రమాదం సెప్టెంబర్ 15న చోటుచేసుకుంది. ఈఘటనలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 77 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా, ఇప్పటి వరకు 38 మృతదేహాలను బయటకు వచ్చాయి. మరో 12 మంది ఆచూకీ తెలియ రాలేదు. కాగా, 2 మృత దేహాలు లభ్యమైనట్లు తెలుస్తుంది. గల్లంతయిన మిగతా మంది అచూకీ వివరాలు తెలిసే అవకాశం ఉంది. బోటు రావడంతో చనిపోయిన తమ వారి మృతదేహాల కోసం ఆత్మీయులు ఎదురు చూస్తున్నారు.
గోదావరి నదిలో వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో రెండు వారాల కిందట ఆపరేషన్ వశిష్ట పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టి, వాతావరణం అనుకూలంగా ఉండటంతో బోటు వెలికితీత పనులు తిరిగి ప్రారంభించారు. ఇందుకోసం ఒక ప్రొక్లెయిన్, భారీ లంగరు (Anchor), ఇనుపరోప్స్ ఉపయోగించి బోటు వెలికీత కార్యక్రమాలు చేపట్టారు. నదీ గర్భం లోపలికి వెళ్లి బోటుకు వెళ్లి తాళ్ళను బిగించటానికి విశాఖకు చెందిన స్కూబా డైవర్స్ సహాయాన్ని తీసుకోవడంతో పనులు మరింత సులువయ్యాయి.