Republic Day 2024: ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఫ్రాన్స్ అధ్యక్షుడు, రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యఅతిధిగా వచ్చేందుకు అంగీకారం
రిపబ్లిక్ వేడుకలకు (Republic Day) హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆహ్వానించగా ఇమ్మాన్యుయేల్ అంగీకరించారు.
New Delhi, DEC 22: వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (French President Emmanuel Macron) ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రిపబ్లిక్ వేడుకలకు (Republic Day) హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆహ్వానించగా ఇమ్మాన్యుయేల్ అంగీకరించారు. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ట్వీట్ చేశారు. రిపబ్లిక్ వేడుకలను మీతో కలిసి జరుపుకుంటానని మాక్రాన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మీ ఆహ్వానానికి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు
. రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఆరో ఫ్రెంచ్ నాయకుడు మాక్రాన్. ఫ్రెంచ్ మాజీ ప్రధాన మంత్రి జాక్వెస్ చిరాక్ 1976, 1998లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు వాలేరి గిస్‌కార్డ్, నికోలస్ సర్కోజి, ఫ్రాంకోయిస్ హోలాండే.. 1980, 2008, 2016లో రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు. 2023 రిపబ్లిక్ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫతాహ్ అల్ సీసీ హాజరయ్యారు. కాగా, గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ తన మిత్ర దేశాల నేతలను ఆహ్వానించడం 1950 నుంచి సంప్రదాయంగా వస్తోన్న విషయం తెలిసిందే.