General Bipin Rawat Funeral: సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులకు ప్రముఖుల నివాళి, మధ్యాహ్నం 2 గంటలకు కామరాజ్ మార్గ్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం
ఢిల్లీలోని సైనిక దవాఖాన నుంచి వారి భౌతికకాయాలను రావత్ (General Bipin Rawat) నివాసానికి తరలించారు. ప్రజలు, ఆర్మీ సిబ్బంది సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడ ఉంచనున్నారు.
New Delhi, Dec 10: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో తుదిశ్వాస విడిచిన సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులకు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఢిల్లీలోని సైనిక దవాఖాన నుంచి వారి భౌతికకాయాలను రావత్ (General Bipin Rawat) నివాసానికి తరలించారు. ప్రజలు, ఆర్మీ సిబ్బంది సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడ ఉంచనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రావత్ దంపతులకు పుష్పాంజలి ఘటించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఢిల్లీ గవర్నర్ అనిల్ బైజల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నివాళులు అర్పించారు.
హెలిక్యాప్టర్ ప్రమాదంలో (IAF Helicopter Crash in Tamil Nadu) ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఘనంగా నివాళులు అర్పించారు. బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్ భౌతిక కాయాలపై పుష్పగుఛ్చాలుంచి అంజలి ఘటించారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా బిపిన్ రావత్ దంపతులకు నివాళులు అర్పించారు.
హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు వివిధ మతాలకు చెందిన పెద్దలు ( Religious leaders ) ఘనంగా నివాళులు అర్పించారు. బిపిన్ రావత్ దంపతుల భౌతిక కాయాలపై పుష్పగుఛ్చాలుంచి అంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
సీడీఎస్ రావత్ దంపతులకు మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు సైనిక సిబ్బంది నివాళులు అర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కామరాజ్ మార్గ్ నుంచి అంతిమయాత్ర (General Bipin Rawat Funeral) ప్రారంభం కానుంది. ఢిల్లీ కంటోన్‌మెంట్‌లోని బ్రార్ స్వ్వేర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పూర్తి సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి గోర్ఖా రైఫిల్స్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది.
హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిద్దర్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్‌లోని శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. బ్రిగేడియర్ లిద్దర్ భౌతికకాయం వద్ద రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. ఆయనతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హర్యానా ముఖ్యమంత్రి మోహన్ లాల్ ఖట్టర్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి లిద్దర్‌కు నివాళులు అర్పించారు.
తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి తిరుచ్చి భారతిదాసన్ విశ్వవిద్యాలయంలో హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన త్రివిధ దళాల అధిపతి బిపిన్‌రావత్ సహా 13 మంది సైనికులకు నివాళులర్పించారు. ఆ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బిపిన్‌రావత్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిపిన్‌రావత్ దేశభద్రత విషయమై దీర్ఘకాలిక ప్రయోజనంతో కూడిన నిర్ణయాలను తీసుకునేవారని కొనియాడారు. ప్రధాని కార్యాలయంలో బిపిన్‌రావత్‌తోపాటు తాను కూడా కలిసి పనిచేశానని ఆయన చెప్పారు. రావత్ మృతి దేశానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. ఈ నివాళి కార్యక్రమంలో మంత్రులు పొన్ముడి, అన్బిల్ మహేష్ పొయ్యామొళి, జిల్లా కలెక్టర్ శివరాసు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 8న మధ్యాహ్నం 12:41 గంటలకు బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్, మరో 12 మంది మిలిటరీ సిబ్బందితో తమిళనాడులోని సూలూర్ నుంచి వెల్లింగ్టన్‌కు వెళ్తున్న హెలిక్యాప్టర్.. నీలగిరి దగ్గర కూనూరు కొండల్లో కుప్పకూలింది. ఆ వెంటనే మంటలు చెలరేగి కాలిపోయింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రావత్ సహా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.