Aarey Green Killing: నీడ కోసం నీడనిచ్చే చెట్ల నరికివేత! ఇప్పటివరకు 2,141 చెట్లు నిర్ధాక్షణ్యంగా నేలకూల్చారు, అత్యవసరంగా విచారించిన సుప్రీంకోర్ట్, చెట్లు నరికివేత ఆపాల్సిందిగా ఉత్తర్వులు

దీనిపై అక్టోబర్ 21న వాదనలు వింటామని అప్పటివరకు ఆ ప్రాంతంలో ఏ ఒక్క చెట్టు నరకకూడదని ఆదేశాలు జారీచేసింది...

Aarey trees slashed | (Photo Credits: Twitter)

Mumbai, October 07: ఒకవైపు చెట్లను పెంచడం కోసం దేశంలోని వివిధ ప్రభుత్వాలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు నీడ నిచ్చే చెట్లను 'నీడ ' కోసమే  నరికివేసే వింత పరిస్థితి ముంబైలోని ఆరే కాలనీ (Aarey colony)లో చోటు చేసుకుంటుంది. మెట్రో కార్ షెడ్ నిర్మాణం కోసం (బస్సులకు బస్ డిపో ఎలాగో, మెట్రో రైళ్లకు మెట్రో రైల్ కార్ షెడ్ అలాగ) ముంబై మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (MMRLC- Mumbai Metro Rail Corporation Limited) వేల సంఖ్యలో చెట్ల నరికివేత కార్యక్రమం చేపట్టింది.

ముంబైలోని ఆరే కాలనీ ప్రాంతం ఆకుపచ్చని పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని ముంబై నగరానికి ఆక్సిజన్ ను అందించే ఆకుపచ్చ ఊపిరితిత్తులుగా అభివర్ణిస్తారు. అలాంటి ప్రాంతంపై ముంబై మెట్రో కన్నుపడింది. దీనికి సర్కార్ మిత్రపక్షమైన శివసేన పార్టీ అడ్డు చెప్పినా, దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం మాత్రం అనుమతులు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆరే కాలనీలో భూమిని చదును చేయడం కోసం అరణ్యం లాంటి ప్రదేశాన్ని మైదానంలా మార్చే ప్రక్రియ ప్రారంభించారు. కళ్ల ముందే ఎక్కడికక్కడ పచ్చని చెట్లు నేలకూలడం చూసి పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు పెద్దఎత్తున ఉద్యమం చేపట్టారు. 2600 చెట్లు ఉన్న ఆ ప్రాంతాన్ని చదును చేయడం అక్రమం అని బొంబాయి హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, బొంబాయి హైకోర్ట్ నుంచి మాత్రం అనుకూలమైన తీర్పు రాలేదు. అక్టోబర్ 04న ఒక్కరోజే 1200పైగా చెట్లు నేలకూలాయి.  చెట్లు నరికితే భారీ జరిమానాలతో పాటు, జైలు శిక్ష తప్పదు..

ఈ నేపథ్యంలో దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని ముంబైకి చెందిన న్యాయశాస్త్ర విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు, సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటంతో నేరుగా చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్‌కి వినతి పత్రం సమర్పించారు. దీంతో సుప్రీం కోర్ట్ చెట్లు నరికివేయడం ఆపాల్సిందింగా అక్టోబర్ 07, సోమవారం రోజు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. దీనిపై అక్టోబర్ 21న వాదనలు వింటామని అప్పటివరకు ఆ ప్రాంతంలో ఏ ఒక్క చెట్టు నరకకూడదని ఆదేశాలు జారీచేసింది.  గొడ్డలి వేటు పడితే పచ్చని చెట్లు ఈ విధంగా తమ బాధను వ్యక్తం చేస్తాయి!

సుప్రీంకోర్ట్ జోక్యంతో చెట్ల నరికివేత కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే అప్పటికే 2,141 చెట్లు నేలకూలాయి. సుప్రీంకోర్ట్ ఆదేశాలు గౌరవించి చెట్లను నరికివేయడం ఆపేస్తామని తెలిపిన MMRLC,  అప్పటికే నరికివేసిన చెట్లను తొలగించడం సహా మిగతా పనులు మాత్రం కొనసాగిస్తామని పేర్కొంది.