Hajipur Triple Rape-Murder Case: హజీపూర్ ముగ్గురు బాలికల అత్యాచారం, హత్య కేసులో దోషికి ఉరిశిక్ష ఖరారు చేసిన జిల్లా న్యాయస్థానం
ఈ కేసులో శ్రీనివాస్ రెడ్డి దోషిగా నిర్ధారించబడిన తర్వాత, కోర్టుకు ఏదైనా చెప్పదలుచుకుంటున్నావా? అని అతణ్ని న్యాయమూర్తి అడిగినపుడు....
Nalgonda, February 7: హజీపూర్‌లో (Hajipur Case) ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన మర్రి శ్రీనివాస్ రెడ్డిని (Marri Srinivas Reddy) మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టు దోషిగా నిర్ధారిస్తూ అతడికి మరణశిక్షను ఖరారు చేసింది. కిడ్నాప్ కేసుపై కూడా విచారించిన కోర్టు దోషికి వేరుగా జీవిత ఖైదు శిక్ష కూడా విధించింది. ఈ కేసుకు సంబంధించి గురువారం తుదితీర్పు వెలువడుతున్న సందర్భంగా పెద్ద న్యాయవాదులు, మీడియా సిబ్బందితో పాటు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనాలతో కోర్ట్ హాలు కిక్కిరిసిపోయింది. వీరందరి సమక్షంలో న్యాయమూర్తి ఉరిశిక్ష (Death Sentence) విధిస్తూ తీర్పు వెలువరించగానే కోర్ట్ హాలు మొత్తం హర్షధ్వానాలతో ప్రతిధ్వనించింది.
యాదాద్రి జిల్లా, బొమ్మల రామారం, హజీపూర్ లో ఒకరు ముగ్గురు ఆడపిల్లల శ్రీనివాస్ రెడ్డి కిడ్నాప్ చేసి వారిపై పాశవికంగా అత్యాచారం జరిపి ఆపై హత్య చేశాడు. ఆ ముగ్గురిలో ఒకరికి 14 ఏళ్లు, మరొకరికి 17, ఇంకొకరికి 11 ఏళ్లు ఉన్నాయి. బాధితులంతా మైనర్లు కావడంతో శ్రీనివాస్ రెడ్డిపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో శ్రీనివాస్ రెడ్డి దోషిగా నిర్ధారించబడిన తర్వాత, కోర్టుకు ఏదైనా చెప్పదలుచుకుంటున్నావా? అని అతణ్ని న్యాయమూర్తి అడిగినపుడు, తాను ఎటువంటి నేరం చేయలేదని, పోలీసులే తనను ఈ కేసుల్లో ఇరికించారని ఆరోపిస్తూ తనపై దయ చూపాలని, వృద్ధులైన తన తల్లిదండ్రులను చూసుకోవాల్సి ఉందని న్యాయమూర్తికి శ్రీనివాస్ రెడ్డి వేడుకున్నాడు. అయితే నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు, వారు బతికే ఉన్నారా అని న్యాయమూర్తి ప్రశ్నించినపుడు, శ్రీనివాస్ రెడ్డి తనకు తెలియదని చెప్పడం గమనార్హం. ఇక్కడితో న్యాయమూర్తి విచారణ ముగించి, మధ్యాహ్నం లంచ్ విరామం ప్రకటించిన తర్వాత ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు, కిడ్నాప్ కేసుకు గానూ జీవిత ఖైదు విధించారు. సమత అత్యాచారం, హత్య కేసులో మరణ శిక్ష విధించిన ఆదిలాబాద్ ప్రత్యేక కోర్ట్
వీటితో పాటు పోక్సో చట్టం (సెక్షన్ 42) కింద ఏడేళ్ల కఠిన జైలు శిక్ష, 376 ఎ-ఐపిసి కింద దాఖలైన కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించారు. అన్ని శిక్షలు ఏకకాలంలో నడుస్తాయని న్యాయమూర్తి తన తీర్పులో వెల్లడించారు. అయితే ఉరిశిక్ష మినహాయింపు కోసం దోషి పైకోర్టులో అప్పీల్ కోసం వెళ్ళవచ్చని, అవసరమైతే అతడికి న్యాయ సహాయం కూడా అందించబడుతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.