Health ATMs: రైల్వే ప్రయాణీకులకు హెల్త్ ఏటీఏం, డబ్బు,సమయం ఆదా, నిమిషాల్లోనే రిపోర్టులు, ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌లో భాగంగా ఏర్పాటు
ప్రధాని మోడీ ప్రభుత్వం ఫిట్ ఇండియా ఉద్యమ కార్యక్రమాన్నిప్రవేశపెట్టిన సంగతి విదితమే.
Lucknow, November 5: ఇండియన్ రైల్వేస్ తన ప్రయాణికుల కోసం వినూత్నమైన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రధాని మోడీ ప్రభుత్వం ఫిట్ ఇండియా ఉద్యమ కార్యక్రమాన్నిప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఫిట్ ఇండియా కార్యక్రమం(Fit India programme) లక్ష్యాలను చేరుకునేందుకు ట్రైన్ జర్నీ చేసే వారి కోసం రైల్వే స్టేషన్లలో హెల్త్ ఏటీఎం(Health ATM)లను ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఇండియన్ రైల్వేస్ లక్నో రైల్వే స్టేషన్( Lucknow Railway Station)లో రెండు హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది.
లక్నో రైల్వే స్టేషన్ కు వచ్చిన ప్రయాణీకులు చాలామంది ఈ హెల్త్ ఏటీఎంను వినియోగించుకుంటున్నారు. ఇక్కడ కేవలం రూ.50 నుంచి 100లతో 16 రకాల హెల్త్ టెస్ట్ లు చేయించుకోవచ్చు. టెస్ట్ లు చేయించుకున్న తరువాత రిపోర్టుల కోసం కూడా ఎక్కువ సమయం వెయిట్ చేయనక్కరలేదు. నిమిషాల్లో రిపోర్టులను అందజేసే సౌకర్యం కూడా ఈ హెల్త్ ఏటీఎంలో ఉంది.
Lucknow Railway Station Health ATM
భారత రైల్వే సహకారంతో ‘ఫిట్ ఇండియా మూవ్‌మెంట్’ కార్యక్రమం కింద ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే( Indian Railway) లక్నో రైల్వే స్టేషన్‌లో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. ఈ సేవలను క్రమంగా దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో కల్పించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇక్కడ రెండు రకాల హెల్త్ చెకప్‌లు ఉంటాయి. ఒకటి 9 నిమిషాల చెకప్. రెండోది 6 నిమిషాల చెకప్. 9 నిమిషాల చెకప్‌కు రూ.100 చెల్లించాలి. అదే 6 నిమిషాల చెకప్‌కు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది.హెల్త్ చెకప్ రిపోర్ట్‌ను వెంటనే పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్‌కు మెయిల్ వస్తుంది. జ్వరం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు సులభంగానే తెలుసుకోవచ్చు. దీంతో జర్నీని కొనసాగించాలా? వద్దా? అని నిర్ణయించుకోవచ్చు’ అని వివరించారు.
బాడీ మాస్ ఇండెక్స్, బ్లడ్ ప్రెజర్, బాడీ ఫ్యాట్, హీమోగ్లోబిన్, మెటబాలిక్ ఏజ్, మజిల్ మాస్, వెయిట్, హైట్, టెంపరేచర్, బసల్ మెటబాలిక్ రేటింగ్, ఆక్సిజన్ శాచురేషన్, పల్స్ రేట్, బ్లడ్ గ్లూకోజ్, బోన్ మాస్ వంటివి హెల్త్ చెకప్‌లో భాగంగా ఉంటాయి.
హెల్త్ ఏటీఎం సెంటర్‌లో ఎవరైనా హెల్త్ రిపోర్ట్ పొందాలంటే అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది హెల్ప్ చేస్తారు. పేరు, వయస్సు, మొబైల్ నెంబర్ లాంటి వివరాలను ఎంటర్ చేసి డబ్బులు చెల్లిస్తే చాలు... కేవలం 5 నిమిషాల్లో రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇప్పటికే హెల్త్ ఏటీఎం కియోస్క్‌లను పలు రైల్వే స్టేషన్లలో భారతీయ రైల్వే ఏర్పాటు చేసింది. రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లలో త్వరలో హెల్త్ ఏటీఎంలు కనిపించనున్నాయి.