Hidden Camera: హైదరాబాద్ రెస్టారెంట్‌లోని మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా, చూసి షాక్ తిన్న యువతి.. పోలీసులకు ఫిర్యాదు, నిందితుణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
వాష్‌రూమ్‌లోని ఓవర్‌హెడ్ షెల్ఫ్‌లో దాచిన కెమెరాను గుర్తించిన ఆమె వెంటనే దీనిపై రెస్టారెంట్ యాజనమాన్యాన్ని నిలదీయడంతో పాటు జూబ్లీహిల్స్ పోలీసులకు...
Hyderabad, September 23: హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్ లో దారుణం చోటుచేసుకుంది. మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాను అమర్చిన ఘటన తీవ్రకలకలం రేపింది. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో గల డ్రైవ్-ఇన్ రెస్టారెంట్ మహిళల వాష్‌రూమ్‌లో రికార్డింగ్ మోడ్ స్విచ్ ఆన్ చేసిన రహస్య కెమెరాను ఓ మహిళా కస్టమర్ గుర్తించింది. వాష్‌రూమ్‌లోని ఓవర్‌హెడ్ షెల్ఫ్‌లో దాచిన కెమెరాను గుర్తించిన ఆమె వెంటనే దీనిపై రెస్టారెంట్ యాజనమాన్యాన్ని నిలదీయడంతో పాటు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. దీనిపై ఎంక్వైరీ చేయగా అది రెస్టారెంటులోనే పనిచేసే ఉద్యోగికి సంబంధించినదిగా నిర్ధారించారు. నిందితుడు నల్గొండ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బెనర్జీ అనే మైనర్ యువకుడిగా గుర్తించి అతణ్ని అరెస్టు చేశారు. అయితే వాష్‌రూమ్ శుభ్రపరచడానికి వెళ్లి తన ఫోన్ అక్కడే మరిచిపోయినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.
నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) లోని సెక్షన్లు 354C (అశ్లీల సంబంధ కార్యకలాపాలకు పాల్పడటం), 509 (మహిళ యొక్క గౌరవాన్ని కించపరచడం) మరియు సెక్షన్ 67 (అసభ్యకరమైన విషయాలను ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించడం లేదా ప్రసారం చేయడం) తదితర చట్టాల కింద కేసు నమోదు చేయబడింది. కెమెరా ఫోన్‌లో నాలుగు గంటల పాటు రికార్డింగ్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
సదరు రెస్టారెంట్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉంది. 20- 25 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళా కస్టమర్ సెప్టెంబర్ 22న బుధవారం తన స్నేహితులతో కలిసి రెస్టారెంటుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె వాష్‌రూమ్‌లోకి వెళ్లినపుడు వెంటిలేటర్ దగ్గర అనుమానాస్పదంగా వీడియో కెమెరా ఆన్ చేసిన ఫోన్ ను గమనించి, రెస్టారెంట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.