Himachal Pradesh Crisis: హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎంకు ప‌ద‌వీ గండం, అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల్సిందే అంటూ గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన బీజేపీ, రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్ తో సంక్షోభం

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ప్ర‌స్తుతం బ‌డ్జెట్ సెష‌న్స్ జ‌రుగుతున్నాయి. దీంతో ఇదే సెష‌న్స్ లో ప్ర‌భుత్వం బ‌ల‌నిరూప‌ణ చేసుకోవాలంటూ ఆయ‌న అన్నారు.

Himachal Pradesh Assembly (Photo Credits: Wikipedia)

Shimla, FEB 28: హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు (Sukhvinder Sukhu) రాజీనామా చేయనున్నారా? ఆయన్ను మార్పు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాజకీయ సంక్షోభం మొదలైంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా సీఎం సుఖ్వీందర్ సింగ్ ను తప్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటానికి నైతిక ప్రాతిపదికను కోల్పోయిందని ప్రతిపక్ష నేత, సీనియర్ బీజేపీ నాయకుడు జైరామ్ ఠాకూర్ అన్నారు.

 

ఈ క్రమంలో సుఖ్వీందర్ సింగ్ సుఖూ ప్రభుత్వంపై బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతోంది.హిమాచ‌ల్ బీజేపీ నేత‌లు గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి ప్ర‌భుత్వంపై బ‌ల‌నిరూప‌ణ ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని కోరారు. ఇవాళ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ నిర్వ‌హించాల‌ని గ‌వ‌ర్న‌ర్ శుక్లాను (Shiv Pratap Shukla) కోరారు బీజేపీ నేత జైరాం ఠాకూర్. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ప్ర‌స్తుతం బ‌డ్జెట్ సెష‌న్స్ జ‌రుగుతున్నాయి. దీంతో ఇదే సెష‌న్స్ లో ప్ర‌భుత్వం బ‌ల‌నిరూప‌ణ చేసుకోవాలంటూ ఆయ‌న అన్నారు.

 

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh Congress Crisis) కాంగ్రెస్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హిమాచల్ లో ఒక్క రాజ్యసభ సీటు ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ తరపున హర్ష్ మహాజన్, కాంగ్రెస్ తరపున అభిషేక్ మను సంఘ్వీ బరిలో నిలిచారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం కారణంగా రాజ్యసభ సీటు కాంగ్రెస్ గెలుచుకోవటం ఖాయమని అందరూ భావించారు. కానీ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు 34-34 ఓట్లు వచ్చాయి. డ్రా ద్వారా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. రాజ్యసభ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవటం పట్ల సీఎం సుఖ్వీందర్ సింగ్ పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది.

 

రాజ్యసభ సభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 25 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు ఉన్నారు. స్వతంత్రులతో కలుపుకొని బీజేపీ రాజ్యసభ అభ్యర్థికి 28 ఓట్లు ఉంటాయి. అదనంగా మరో ఆరు ఓట్లు వచ్చాయి. ఆ ఆరు ఓట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలవే. దీంతో 34 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుఖ్వీందర్ సింగ్ ను సీఎం కుర్చీనుంచి తొలగించాలని కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. డీకే శివకుమార్, భూపేంద్ర సింగ్ వారితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది.