Justice For Disha: డిసెంబర్ 31లోపు 'దిశ' కేసులో నేరస్తులను ఉరి తీయాలి, పార్లమెంటులో హైదరాబాద్ హత్యోదంతంపై చర్చ, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను కఠినతరం చేయాలని, దోషులకు వెంటనే శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సభ్యులు గళమెత్తారు.....

Parliament Sessions _ Justice for Disha - People Protest | Photo - Wikimedia Commons

New Delhi, December 02:  హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ (Disha) అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ దారుణానికి పాల్పడిన నేరస్తులకు బహిరంగ మరణశిక్ష విధించాలంటూ దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఉధృతమైన నిరసన కార్యక్రమాలను (Protest)  చేపడుతున్నారు. హైదరాబాద్, దిల్లీ, వారణాసి ఇలా దేశంలో ఏదో ఒక మూల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

సోమవారం దిశ ఘటన పార్లమెంటు (Parliament)లో చర్చకు వచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను కఠినతరం చేయాలని, దోషులకు వెంటనే శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సభ్యులు గళమెత్తారు. అన్నాడీఎంకే ఎంపీ విజిలా సత్యానాథ్ (Vijila Sathyananth) మాట్లాడుతూ దిశను హత్య చేసిన నలుగురు నేరస్తులను డిసెంబర్ 31లోపు ఉరితీయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ జీరో ఎఫ్ఐఆర్ పై సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఆదేశాలని పాటించాలని తెలిపారు. ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇలాంటి ఘటనల పట్ల పోలీసులు తమ పరిధితో సంబంధం లేకుండా కేసు నమోదు చేసుకొని తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

మరో రాజ్యసభ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ (Gulam Nabi Azad) మాట్లాడుతూ, ఇప్పటికే ఎన్నో చట్టాలు చేశాము, కానీ ఎన్ని చట్టాలు చేసినా సరిపోవడం లేదనిపిస్తుంది. ఇలాంటి ఘటన జరగాలని ఎవరూ కోరుకోరు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఇది అందరి సమిష్టి బాధ్యతగా భావించాలి. సమస్యను మూలాల నుంచి తొలగించటం కోసం సమాజం నిలబడాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒక వాతావరణం మహిళలకు కల్పించాలి. ఎలాంటి పక్షపాతాలు లేకుండా నేరస్తులకు కఠినమైన శిక్షలు అమలు చేయాలి.

దిశ నేరస్తులను బహిరంగంగా శిక్షించాలి ఎంపీ జయాబచ్చన్ (Jaya Bachchan) అన్నారు. దిశ హత్య కేసులో ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన సమాధానం కోసం దేశప్రజలు ఎదురు చూస్తున్నారు. నిర్భయ కేసులో కూడా ఇంకా న్యాయం జరగలేదని జయా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మన వ్యవస్థకే తీవ్ర అవమానం

హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన మన సమాజానికి, మన వ్యవస్థకు తీవ్ర అవమానం అని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునారావృతం కాకూడదు. మహిళలపై దాడులు జరగకూడదు, వీటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలి. దిశ ఘటనపై సభ్యులందరూ తమ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని వెంకయ్య నాయుడు కోరారు.

ఇక మరోవైపు లోకసభ ఎంపీ రేవంత్ రెడ్డి, దిశ హత్య కేసులో దోషులను శిక్షించాలి, మహిళలను కాపాడాలంటూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు.