IAF Helicopter Crash: హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ అతనొక్కడే దర్యాప్తులో కీలకం.. లైఫ్ సపోర్ట్‌పై గ్రూపు కెప్టెన్ వరుణ్ సింగ్, ఆయన్ను బ్రతికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ప్రమాదంలో మరణించినవారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు.
New Delhi, Dec 9: తమిళనాడు రాష్ట్రంలో నిన్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన (Rajnath Singh briefs Parliament) చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో (IAF Helicopter Crash) 13 మంది మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారని, ఆయన్ను బ్రతికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో మరణించినవారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు.
ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో బయటపడిన శౌర్యచక్ర అవార్డు గ్రహీత, ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ (Group Captain Varun Singh) తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రిలో (military hospital in Wellington) చికిత్స పొందుతున్నారు. 48 గంటలు గడిస్తేనే గానీ ఆయన పరిస్థితిపై అంచనాకి రాలేమని వైద్యులు వెల్లడించారు. వరుణ్ సింగ్ ను మెరుగైన వైద్యం అందించడం కోసం అతన్ని బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్ కమాండ్ ఆస్పత్రికి తరలించేందుకు ఆర్మీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. ఈ ప్రమాద ఘటనపై జరగబోయే దర్యాప్తులో ఆయన కీలకంగా మారనున్నారు.
గతేడాది ఒక విమాన ప్రమాదం నుంచి ఆయన తృటిలో బయటపడడమే కాకుండా, తన సాహసానికి ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఆయన శౌర్య చక్ర అవార్డు అందుకున్నారు. 2020 ఏరియల్ ఎమర్జెన్సీ సందర్భంగా తాను నడిపే ఎల్‌సీఏ తేజాస్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కాపాడినందుకు ఆయనకు శౌర్యచక్ర అవార్డునిచ్చారు. 2020లో ఎల్‌సీఏ(లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) స్క్వాడ్రన్‌లో ఆయన వింగ్‌కమాండర్‌గా ఉన్నారు. 2020 అక్టోబర్ 12న విమానంలోని కొన్ని వ్యవస్థల్లో చేసిన మార్పులను పరీక్షించేందుకు ఎల్‌సీఏలోని ఒక విమానాన్ని చెకింగ్‌కు తీసుకుపోయారు. ఆ సమయంలో కాక్‌పిట్ పీడన వ్యవస్థ ఫెయిలయింది. దీన్ని ఆయన సరిగా గుర్తించి జాగ్రత్తతో విమానాన్ని ల్యాండ్ చేశారు. ప్యారాచూట్‌తో ఆయన బయటపడే అవకాశం ఉన్నా, విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి యత్నించి సఫలమయ్యారు.