Kerala: కేరళ చరిత్రలో అరుదైన ఘటన, భర్త స్థానంలో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన భార్య..
అదే వారిద్దరూ ఐఏఎస్ (IAS) ఆఫీసర్లైతే రోజువారీగా కుటుంబ నిర్వహణతోపాటు అధికార విధుల్లోనూ కలిసే పాల్గొంటారు. కానీ, కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న భర్త స్థానంలో భార్య చీఫ్ సెక్రటరీగా (Chief Secretary) బాధ్యతలు చేపట్టనున్నారు.
Tiruvanthapuram, AUG 30: భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కుటుంబ నిర్వహణ సాధ్యం.. అదే వారిద్దరూ ఐఏఎస్ (IAS) ఆఫీసర్లైతే రోజువారీగా కుటుంబ నిర్వహణతోపాటు అధికార విధుల్లోనూ కలిసే పాల్గొంటారు. కానీ, కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న భర్త స్థానంలో భార్య చీఫ్ సెక్రటరీగా (Chief Secretary) బాధ్యతలు చేపట్టనున్నారు. వీ వేణు అనే ఐఏఎస్ అధికారి- కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (Kerala Chief Secretary) ఈ నెల 31న రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయనకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ వీడ్కోలు సమావేశంలో కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ ఈ సంగతి గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వీ వేణు స్థానంలో ఆయన భార్య శారదా మురళీధరన్ (Sharadha Muralidharan) బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఆమె పని చేస్తున్నారు.
కేరళ చరిత్రలోనే తొలిసారి ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అవుతున్న భర్త వీ వేణు (Venu) నుంచి శారదా మురళీధరన్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారని సీఎం పినరయి విజయన్ చెప్పారు. ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతాయన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలెక్టర్లుగా.. వివిధ శాఖల అధిపతులుగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా వేర్వేరు సమయాల్లో విధులు నిర్వర్తిస్తుంటారని అన్నారు. వీ వేణు స్థానంలో చీఫ్ సెక్రటరీగా ఆయన భార్య శారదా మురళీధరన్ బాధ్యతలు స్వీకరించడం ఇదే మొదటి సారన్నారు.
ఐఏఎస్ లుగా 34 ఏండ్లుగా వారిద్దరూ బాధ్యతలు నిర్వహించారు. తన భర్త వీ వేణు వీడ్కోలు సమావేశంలో శారదా మురళీధరన్ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు కొంచెం ఆందోళనకు గురవుతున్నాను. ఆయన రిటైర్ మెంట్ తర్వాత మరో ఎనిమిది నెలలు సర్వీసులో కొనసాగాల్సి ఉంది. మేం ఇద్దరం ఒకేసారీ సర్వీసులో చేరాం. కానీ ఒకేసారి రిటైర్ కావడం లేదు’ అని అన్నారు.