Oxford Vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్ ధర రూ.1000, ప్రకటించిన సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా, 2021 ఏప్రిల్ నుంచి సాధారణ ప్రజలకు అందుబాటులోకి
2021 ఏప్రిల్ నుంచి సాధారణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ (Oxford Vaccine) అందుబాటులోకి తీసుకొస్తామని సీరం సీఈఓ అదర్ పూనావాలా (Adar Poonawalla) గురువారం ప్రకటించారు.
New Delhi, Nov 20: కరోనా వ్యాక్సిన్ మీద సీరం ఇన్‌స్టిట్యూట్ కీలక విషయాన్ని ప్రకటించింది. 2021 ఏప్రిల్ నుంచి సాధారణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ (Oxford Vaccine) అందుబాటులోకి తీసుకొస్తామని సీరం సీఈఓ అదర్ పూనావాలా (Adar Poonawalla) గురువారం ప్రకటించారు. తాము ఉత్పత్తి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ధర రూ.1000 వరకు ఉంటుందని తెలిపారు. రెండు డోసుల తమ వ్యాక్సిన్‌ను 5-6 డాలర్ల చొప్పున ( సుమారు వెయ్యి రూపాయలకు) అందిస్తామన్నారు.
ఫలితాలు, నియంత్రణ ఆమోదాలను బట్టి 2021 ఫిబ్రవరి లోపు హెల్త్ కేర్ సిబ్బందికి, వృద్దులకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే ఏప్రిల్ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండనుందని పూనావాలా తెలిపారు. ఫిబ్రవరి నుంచి నెలకు సుమారు 10 కోట్ల మోతాదులను తయారు చేయాలని ఎస్‌ఐఐ యోచిస్తోందని.. 2024 నాటికి దేశంలోని అందరికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందన్నారు.
ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ఇండియాలోని సీరం ఇన్స్టిట్యూట్‌తో కలిసి కరోనా వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశీయంగా భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాగ్సిన్ మూడవ దశ ప్రయోగాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.