India's COVID Update: గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 21,821 పాజిటివ్ కేసులు నమోదు, 96 శాతానికి మెరుగుపడిన రికవరీ రేటు, 257,656గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుండంతో దేశంలో రికవరీ రేటు 96 శాతం దాటింది.....
New Delhi, December 31: దేశంలో ప్రతిరోజు వేలల్లో కొత్త కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి, అయితే రికవరీ రేటు కూడా ఎప్పటికప్పుడు మెరుగుపడుతోంది. కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుండంతో దేశంలో రికవరీ రేటు 96 శాతం దాటింది. మరోవైపు కొత్త వేరియంట్ వైరస్ విజృంభన నేపథ్యంలో యూకే ప్రభుత్వం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది. దీంతో భారత్ లో కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు మార్గం మరింత సుగమం అయింది. భారతదేశంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) 'కోవిషీల్డ్' పేరుతో అభివృద్ధి చేస్తుంది.
ఇక దేశంలో నమోదైన కేసుల విషయానికి వస్తే, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 21,821 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 1,02,66,674కు చేరింది. నిన్న ఒక్కరోజే 299 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,48,738కు పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26,139 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 98,60,280 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 2,57,656 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India's COVID19 Update:
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 96.04% ఉండగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 2.51% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.45% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇక డిసెంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా 17,20,49,274 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 11,27,244 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇదిలా ఉంటే గ్లోబల్ కరోనావైరస్ కేసుల సంఖ్య 82.6 మిలియన్ల మార్కును దాటేసింది, మరణాలు 1.80 మిలియన్లకు పైగా పెరిగాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.
గురువారం ఉదయం నాటికి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,655,924గా ఉండగా, మరణాలు 1,803,942కు పెరిగాయని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్ఎస్ఇ) తన తాజా నవీకరణలో వెల్లడించింది.