PM Modi on Sanatana Dharma: సనాతన ధర్మంపై తొలిసారిగా స్పందించిన ప్రధాని మోదీ, ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటుందని మండిపాటు
విపక్ష ఇండియా (INDIA) కూటమికి భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు.
New Delhi, Sep 14: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా అగ్గి రాజేస్తూనే ఉంది. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చుతూ, దాన్ని నిర్మూలించాలంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలను కొంతమంది సమర్థిస్తుండగా.. బీజేపీ, హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై ఘాటుగా స్పందించారు.
సనాతన ధర్మం (Sanatana Dharma)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తొలిసారిగా స్పందించారు. విపక్ష ఇండియా (INDIA) కూటమికి భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు. స్వామి వివేకానంద, లోకమాన్య తిలిక్ స్ఫూర్తిగా నిలిచిన సనాతన ధర్మాన్ని పూర్తిగా చెరిపేయాలని వీరు కోరుకుంటున్నారని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని విమర్శించారు.
ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ నోటీసులు, రాజకీయ కక్షతో మోడీ నాకు పంపిన నోటీసు అని మండిపడిన కవిత
ఈరోజు సతాన ధర్మాన్ని బహిరంగంగా విమర్శించడంతో ఈ దాడులు ప్రారంభించారని, రేపు మనపై ఈ దాడులను ముమ్మరం చేస్తారని అన్నారు. దేశంలోని సనాతనధర్మ అనుయాయులు, దేశాన్ని ప్రేమించేవారంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి ప్రజలను అడ్డుకోవాలని చెప్పారు. దేశాన్ని వెయ్యేళ్లు వెనక్కి తీసుకెళ్లి, బానిసత్వంలోకి నెట్టేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు.
మధ్యప్రదేశ్‌లోని బినాలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ సహా, రాష్ట్రంలో పది కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి గురువారంనాడు శంకుస్థాపన చేశారు. రూ.50,700 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా బినాలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల ఇండియా కూటమి ముంబైలో భేటీ అయ్యింది. ఘమండియా (దురహంకారి) కూటమిని నడిపేందు కోసం వ్యూహాలను వారు సిద్ధం చేసుకొని ఉంటారని నేను అనుకుంటున్నా. భారత సంస్కృతిపై దాడి చేయడమే వారి వ్యూహం. వేల ఏళ్లుగా దేశాన్ని ఏకం చేసిన భారతీయుల నమ్మకాలు, విలువలు, సంప్రదాయాలపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు’ అని ధ్వజమెత్తారు. బహిరంగంగా ఇండియా కూటమి నేతలు సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నారని, రాబోయే రోజుల్లో వాళ్లు మనపై దాడుల్ని ఉధృతం చేస్తారని మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సనాతన ఆచారాన్ని పాటించేవాళ్లు, ఈ దేశాన్ని ప్రేమించేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కలిసి కట్టుగా ఆ పోరాటాన్ని ఆపాలని.. వారి వ్యూహాలను విజయవంతం అవ్వకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
దేవి అహల్యాబాయి హోల్కర్‌కు స్ఫూర్తినిచ్చిన సనాతన సంస్కృతి, సంప్రదాయాలను అంతం చేయాలని 'ఘమండియ' కూటమి కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయికి సనాతన ధర్మమే ఓ బలంగా నిలిచిందని. తన ఘాన్సీ ప్రాంతాన్ని వదులుకోనని బ్రిటిష్ వారికి సవాల్ విసిరిందని చెప్పారు. మహర్షి వాల్మీకి కూడా సనాతన ధర్మాన్ని ఆచరించారన్నారు. మహాత్మాగాంధీ సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించారన్న ప్రధాని మోదీ.. ఆయనకు రాముడు ప్రేరణగా నిలిచారని చనిపోయే ముందు కూడా ‘హేరామ్’ అని సంభోదించారని చెప్పారు.
ఇక స్వామి వివేకానంద, లోకమాణ్య తిలక్ లాంటి వారికి సనాతన ధర్మమే ప్రేరణగా నిలిచిందని మోదీ తెలిపారు. సనాతన శక్తితోనే స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ వాళ్ల చేతిలో ఉరికంబం ఎక్కిన వీరులు కూడా భారతమాత ఒడిలోనే మళ్లీ జన్మించాలని కోరుకున్నట్లు చెప్పారు. ఆ ధర్మమే వేల సంవత్సరాల నుంచి భారత్‌ను ఒక్కటిగా నిలిపిందన్నారు. అలాంటి ధర్మాన్ని ఇండియా కూటమి నాశనం చేయాలని భావిస్తోందని ఆరోపించారు. ఇండియా కూటమి పార్టీలు అంతా ఒక్కటే.. ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలని చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
విపక్ష కూటమికి (I.N.D.I.A.) నాయకుడు లేడని, నాయకత్వంపై గందరగోళం ఉందని ప్రధాని విమర్శించారు. ''ముంబైలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఒక పాలసీ రూపొందించారు. భారతీయ సంస్కృతిపై దాడి...భారతీయుల విశ్వాసాలపై దాడి చేయడమే ఇండీ ఎలయెన్స్ విధానం'' అని మోదీ అన్నారు.ఎందరో వీరులు పుట్టిన గడ్డ బుందేల్‌ఖండ్ అని, బినా, బెట్వా ప్రజలను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని మోదీ అన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని మరింత ప్రోత్సహించేలా రూ.50,000 కోట్లతో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నామని, ఈ ప్రాజెక్టులను ప్రారంభించి, ప్రజలను కలుసుకునే అవకాశం కల్పించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్‌కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. కొన్ని రాష్ట్రాల బడ్జెట్ రూ.50,000 కోట్లు కూడా లేదని, మధ్యప్రదేశ్‌లో అంతకంటే ఎక్కువ మొత్తాన్నే అభివృద్ధి ప్రాజెక్టులకు వెచ్చిస్తున్నామని చెప్పారు.
జి-20 సదస్సును విజయవంతంగా నిర్వహించడం అంతా చూసారని, నిజానికి ఈ విజయం దేశ ప్రజల విజయమని మోదీ అభివర్ణించారు. ఇది 140 కోట్ల మంది ప్రజానీకం విజయమన్నారు. దేశ సమష్టి శక్తికి ఇది నిదర్శనమని చెప్పారు. దేశంలోని భిన్నత్వం, వారసత్వ సంపద జి-20 ప్రతినిధుల మనసులను దోచుకుందని అన్నారు.
ప్రధాని కంటే ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సనాతన ధర్మంపై స్పందిస్తూ.. దీనిపై చర్యలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు. ‘‘సనాతన ధర్మానికి మద్దతుగా స్పందించాలంటూ ప్రధాని మోదీ తన కేబినెట్ మంత్రులకు కొన్ని రోజుల క్రితం సూచించారు. దీనిపై రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ట్రాప్‌లో మనం చిక్కుకోవద్దు’’ అని స్టాలిన్ వివరించారు. బీజేపీ అవినీతిని ప్రధానంగా ప్రస్తావించాలంటూ సూచించారు. కళంకిత, మతతత్వ, నిరంకుశ బీజేపీ ప్రభుత్వం నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కష్టపడి పనిచేయాలని కోరారు.