COVID19 in India: భారత్‌లో 25 లక్షలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 65,002 కేసులు నమోదు, 49 వేలు దాటిన కరోనా మరణాలు
నేడు 25 లక్షల మార్కును దాటేయటం అంటే దేశంలో మరో 5 లక్షల కేసులు పెరగటానికి కేవలం 8 రోజులు మాత్రమే పట్టింది....
New Delhi, August 15: భారతదేశంలో ప్రతిరోజు రికార్డు స్థాయిలో కొవిడ్19 కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 65,002 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 25,26,193 కు చేరింది. నిన్న ఒక్కరోజే 996 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 49,036కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 57,381 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,808,936 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 6,68,220 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India's COVID19 Update:
ఆగష్టు 7 నాటికి దేశంలో కొవిడ్ కేసులు 20 లక్షల మార్కును దాటాయి. నేడు 25 లక్షల మార్కును దాటేయటం అంటే దేశంలో మరో 5 లక్షల కేసులు పెరగటానికి కేవలం 8 రోజులు మాత్రమే పట్టింది. అయితే మరోవైపు ఈ మహమ్మారి బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ప్రతిరోజు వేల సంఖ్యలో పెరగడం కొంత ఊరటనిచ్చే విషయం.
దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, దిల్లీ లాంటి రాష్ట్రాలలో కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూపోతున్నాయి. నేటి వరకు ఉన్న కొవిడ్ కేసులను పరిశీలిస్తే అత్యధికంగా మహారాష్ట్రలో 5,72,734 పాజిటివ్ కేసులు 19,427 కరోనా మరణాలు నమోదయ్యాయి.
ఇక ప్రపంచవ్యాప్తంగా గల కొవిడ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 21 మిలియన్లు దాటగా, మరణాలు 763,000 కు చేరువైనట్లు జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నివేదిక పేర్కొంది.