Celebreities Cast Vote: కర్ణాటకలో ఓటెత్తిన చైతన్యం, సామాన్యుల్లా లైన్లో నిలబడి ఓట్లేస్తున్న సెలబ్రెటీలు, పెళ్లి పీటల మీద నుంచి వచ్చి మరీ ఓటేసిన యువతి
ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. ప్రముఖులు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకులు నారాయణ మూర్తి (Narayana Murthy), ఆయన సతీమణి సుధా మూర్తి (Sudha Murty) ఓటు వేయడానికి బెంగళూరులోని పోలింగ్ స్టేషన్‌కు వచ్చారు
Bangalore, May 10: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. ప్రముఖులు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకులు నారాయణ మూర్తి (Narayana Murthy), ఆయన సతీమణి సుధా మూర్తి (Sudha Murty) ఓటు వేయడానికి బెంగళూరులోని పోలింగ్ స్టేషన్‌కు వచ్చారు. సాధారణ ఓటర్లతోపాటు నాయరాయణ మూర్తి కూడా లైన్‌లో నిలబడి ఓటువేశారు. అనంతరం మాట్లాడుతూ.. మొదట మనం ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. ఆ తర్వాతే మంచి చెడు గురించి మాట్లాడాలి. ఓటేయనివారికి విమర్శించే హక్కు లేదని చెప్పారు. ప్రతి ఒక్కరు ఓటేయాలని సూచించారు.
అటు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు బెంగళూరు శాంతినగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లోని పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కర్ణాటక ప్రశాంతంగా ఉండాలంటే అది మనకు చాలా అవసరం అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.
ఇక పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నం ఫలిస్తోంది. చాలా మంది ఓట్లు వేసేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. ఎన్ని పనులు ఉన్నా వచ్చి ఓటు వేస్తున్నారు. చిక్కమంగళూరులో ఓ యువతి పెళ్లి పీటల మీద నుంచి వచ్చిమరీ ఓటు వేసింది. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారుతోంది. ఓటువేసేందుకు రాకుండా బద్దకంగా వ్యవహరించేవారికి ఆమె ఆదర్శమంటూ అంతా ప్రశంసిస్తున్నారు.
కర్ణాటకలోని 224 నియోజకవర్గాలకు గానూ 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 5,31,33,054 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సీఎం బొమ్మై (బీజేపీ) శింగావ్ నుంచి, మాజీ సీఎంలు సిద్ధరామయ్య(కాంగ్రెస్) వరుణ నుంచి, శెట్టర్ (కాంగ్రెస్) హుబ్బళ్లి-ధార్వాడ సెంట్రల్ నుంచి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (జేడీఎస్) చెన్నపట్టణ నుంచి బరిలో నిలిచారు. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.