Jammu and Kashmir: జమ్మూలో పోలీస్ ఉన్నతాధికారి దారుణ హత్య, ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి, గొంతు కోసి హత్య చేసినట్లుగా వార్తలు, పరారీలో పనిమనిషి
అనుమానాస్పద స్థితిలో జమ్మూలోని ఆయన నివాసంలో సోమవారం లోహియా మృతదేహం లభ్యమైందని పోలీసులు పేర్కొన్నారు.
Jammu, Jammu, Oct 4: జమ్ముకశ్మీర్ జైళ్ల ఉన్నతాధికారి హేమంత్ లోహియా దారుణ హత్యకు (DG Prisons Hemant Lohia Found Murdered) గురయ్యారు. అనుమానాస్పద స్థితిలో జమ్మూలోని ఆయన నివాసంలో సోమవారం లోహియా మృతదేహం లభ్యమైందని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. అయితే, డీజీ (DG Prisons Hemant Lohia) ఇంట్లో పని చేసే వ్యక్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.నిందితులు ఆయనను గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు దీన్ని ధ్రువీకరించలేదు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.హేమంత్ లోహియా ఇంట్లో పనిచేసే వ్యక్తి పరారీలో ఉన్నాడని జమ్ము జోన్ అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ వెల్లడించారు. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అతను దొరికితే కీలక విషయాలు తెలిసే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన లోహియా(57) జమ్ముకశ్మీర్ జైళ్ల డీజీగా పనిచేస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్ డిప్యూటేషన్ నుంచి తిరిగి వచ్చారు. జమ్మూకు తిరిగి వచ్చే ముందు బీఎస్‌ఎఫ్‌లో పని చేశారు. ఆ తర్వాత డీజీపీ హోదాలో పదోన్నతి పొందారు. ఆగస్టులో జమ్మూ కశ్మీర్ డీజీపీగా నియామకమయ్యారు.
దుర్గా పూజలో అపశృతి, ఒక్కసారిగా మంటపంలో ఎగసిన మంటలు, 5గురు మృతి, మరో 64 మందికి గాయాలు
30 సంవత్సరాల సుధీర్ఘ కెరీర్‌లో పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. తీవ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో సెంట్రల్ కశ్మీర్ డీఐజీగా ఉన్నారు. లాల్ చౌక్ వద్ద జరిగిన ఫిదాయీన్ దాడిలో పాకిస్థానీ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత దక్షిణ కాశ్మీర్ డీఐజీగా పనిచేశారు. సెంట్రల్ డిప్యూటేషన్‌పై వెళ్లడానికి ముందు సీఐడీలోనూ విశేష సేవలందించారు.డీసీ హత్యకు గురవడంతో ఆయన కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది.