Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు, కొన్ని చోట్ల కమ్యూనికేషన్ పునరుద్ధరణ, పుకార్లు వ్యాపిస్తున్న నేపథ్యంలో హైఅలర్ట్.
జమ్మూకాశ్మీర్ లోని కొన్ని జిల్లాలను సైతం తీసివేస్తున్నట్లు పుకార్లు వ్యాపించండంతో భద్రతా దళాలు వెంటనే అలర్టై అందుకు కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు...
Jammu & Kashmir, August 09: వారం రోజులుగా జమ్మూకాశ్మీర్‌లో జనజీవనం స్తంభించిపోయింది. ఆర్టికల్ 370 రద్దు కారణంగా నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. అయితే శుక్రవారం ప్రార్థనల నిమిత్తం అక్కడి ప్రజలకు కొంత ఊరట కలిగించేలా అధికారులు కర్ఫ్యూను పాక్షికంగా సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మసీదులు తెరుచుకున్నాయి. పలుచోట్ల టెలిఫోన్, మొబైల్ మరియు ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించారు. అయితే ఘర్షణలు చెలరేగే అవకాశం ఉండటంతో ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
జమ్మూకాశ్మీర్ లోని కొన్ని జిల్లాలను సైతం తీసివేస్తున్నట్లు పుకార్లు వ్యాపించండంతో భద్రతా దళాలు వెంటనే అలర్టై అందుకు కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నచిన్న ఘటనలు మినహా కాశ్మీర్ లోయలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు బయటకు వచ్చి ప్రార్థనలు నిర్వహించుకుంటున్నారని అధికారులు తెలిపారు.
జమ్మూకాశ్మీర్ ను కేంద్రప్రాంతపాలిత ప్రాంతం చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రోజున జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కాశ్మీర్ ప్రజల పురోగతి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయం అందుతుందని స్పష్టం చేశారు. పండగలు జరుపుకునేందుకు కూడా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించుకులా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అక్కడ నిషేధాజ్ఞలను సడలిస్తున్నారు.
ఆగష్టు 12న సోమవారం ఈద్-ఉల్-అదా (బక్రీద్) పండగ ఉన్నందున, దానికి ఒకరోజు ముందు అంటే ఆదివారం రోజునుంచే కర్ఫ్యూను పూర్తిగా సడలించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రజలు పండగకు అవసరమయ్యే ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చు. అందుకోసం అధికారులు ఇప్పటికే అన్నింటిని సిద్ధం చేసి ఉంచారు.
ఏది ఏమైనా, జమ్మూకాశ్మీర్ లో పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉంది. బక్రీద్ సందర్భంగా ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకి వస్తారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదా మరియు స్పెషల్ స్టేటస్ కోల్పోయి కేంద్రప్రాంతం కావడం పట్ల సహజంగానే అక్కడి ప్రజల్లో అసంతృప్తి ఉంది. తాము ఏదో కోల్పోయామనే బాధ తమలో ఉంది. అయితే ఇది ఎలాంటి అలజడికి దారితీస్తుంది. ఏ రూపంలో విరుచుకుపడుతుంది అనే టెన్షన్ మాత్రం ఇప్పటికీ ఆ ప్రాంతంలో నెలకొని ఉంది.