Karnataka Bandh: స్థానికులకే ఉద్యోగాల్లో పెద్దపీఠ వేయాలని డిమాండ్ చేస్తూ కన్నడిగుల ఆందోళన, నేడు కర్ణాటక బంద్‌కు పిలుపు, ఏపీ టూరిజం బస్సుపై రాళ్ల దాడి
దీంతో బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి.....
Bengaluru, February 13: కర్ణాటకలోని పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థలు మరియు ప్రభుత్వ రంగాల్లో కన్నడిగులకే ఎక్కువ శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కన్నడ సంఘాల సమాఖ్య ఆందోళన (Kannadigas Protest) చేపట్టింది. కన్నడిగులకే ఉద్యోగులకు కల్పించేలా సరోజిని మహిషి కమిటీ 1984లో ఇచ్చిన నివేదికను (Sarojini Mahishi Report) రాష్ట్రంలో తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 'కర్ణాటక సంఘటనాగళ ఓక్కూట', 'కర్ణాటక రక్షణా వేదికే' సహా మొత్తం 113 పైగా కన్నడ సంఘాలు కలిసి గురువారం ఒక్కరోజు కర్ణాటక బంద్ (Karnataka Bandh) కు పిలుపునిచ్చాయి. దీంతో ఈ ఉదయం 6 గంటల నుంచే షాపులు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. వాహనాల రాకపోకలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఈ బంద్ కు ఓలా-ఉబెర్ క్యాబ్ డ్రైవర్ల సంఘం, కొన్ని ఆటో యూనియన్లు, రైతుల సంఘాలు, వీధి విక్రేతలు, కార్మిక సంఘాలు మరియు పలు ట్రావెలింగ్ ఏజెన్సీలు కూడా మద్ధతు పలకడంతో జనజీవనం స్తంభించిపోయింది. అయినప్పటికీ విద్యాసంస్థలు, బస్సు సర్వీసులు యధావిధిగా నడుస్తున్నాయి.
కాగా, నేడు ఇచ్చిన బంద్ పిలుపు పలుచోట్ల ఉద్రిక్తలకు దారితీసింది. మంగళూరులోని ఫరంగిపేటలో తిరుపతి వెళ్లే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు చెందిన బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
Take a look at here:
కాగా, కన్నడ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ పై కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పందించారు. తమ ప్రభుత్వం కూడా కన్నడ వాదనకు అనుకూలమే అని పేర్కొన్నారు. సరోజిని మహిషి కమిటీ నివేదికతో పాటు, ఇంకా ఎలాంటి చర్యలు చేపడితే మేలు జరుగుతుందో సాధ్యమైనవన్నీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఆందోళన విరమించి తమతో చర్చలకు వస్తే తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని సీఎం తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కల్పించకుండా, బంద్ విరమించాలని సీఎం వారికి సూచించారు.