COVID-19 in India: తెలంగాణలో కరోనావైరస్ కేసుతో రెండు రాష్ట్రాల ఆందోళన, అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములు
గత నెలలో ఆఫీస్ పని మీదే దుబాయ్ వెళ్లిన ఆ యువకుడు అక్కడే కరోనావైరస్ బారిన పడినట్లు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత బాధితుడు నేరుగా ఫిబ్రవరి 19న దుబాయి నుంచి ముందుగా బెంగళూరు నగరానికి వచ్చాడు. అక్కడే తన ఆఫీసులో రెండు రోజుల పాటు పనిచేసి, ఆ తర్వాత సెలవుపై హైదరాబాద్ వచ్చాడు. అతడు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఏసీ బస్సులో ప్రయాణించాడు.....
Hyderabad/Bengaluru, March 3: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసు ధ్రువీకరించబడిన ఇటు తెలంగాణ ఆరోగ్య శాఖ, అటు కర్ణాటక ఆరోగ్య శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కారణం బాధితుడు బెంగళూరు నగరంలోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత నెలలో ఆఫీస్ పని మీదే దుబాయ్ వెళ్లిన ఆ యువకుడు అక్కడే కరోనావైరస్ బారిన పడినట్లు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత బాధితుడు నేరుగా ఫిబ్రవరి 19న దుబాయి నుంచి ముందుగా బెంగళూరు నగరానికి వచ్చాడు. అక్కడే తన ఆఫీసులో రెండు రోజుల పాటు పనిచేసి, ఆ తర్వాత సెలవుపై హైదరాబాద్ వచ్చాడు. అతడు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఏసీ బస్సులో ప్రయాణించాడు. ఆ బస్సులో ఇతడితో పాటు మరో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏసీలో అయితే వైరస్ ఇంకా వేగంగా వ్యాపిస్తుంది.
బాధితుడు 24 ఏళ్ల యువకుడు కావడంతో అతడికి నిర్వహించిన ప్రాథమిక పరీక్షలలో వ్యాధి నిర్ధారణ కాలేదు, కానీ లక్షణాలు కనిపిస్తుండటంతో ఆ తర్వాత నిర్వహించిన పరీక్షలలో కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. భారత్ లో రెండు కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక, హైదరాబాద్ లో కరోనావైరస్ కేసు నమోదు కావడం, ఇది అంటు వ్యాధి కావడం మరియు బాధితుడు బెంగళూరు - హైదరాబాద్ నగరాల్లో తిరగడం, ఏసీ బస్సుల్లో ప్రయాణించడంతో ఇప్పుడు ఈ వైరస్ ఎంతమందికి వ్యాపించిందనేది అంతుచిక్కకుండా పోయింది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంధర్, పరిస్థితులను ఎదుర్కోవడానికి ఏర్పాట్లకు ఆదేశించారు. యువకుడి కుటుంబ సభ్యులు, మిత్రులు, ఇతడితో పాటు బస్సులో ప్రయాణించిన వారందరికీ కోవిడ్- పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు, బాధితుడు బెంగళూరు నగరంలోనే పనిచేసే వ్యక్తి కావడం, కరోనావైరస్ బారిన పడిన తర్వాత ముందుగా ఇక్కడే రెండు మూడు రోజులు తిరగడం, ఆఫీసుకు వెళ్లడం చేయడంతో కర్ణాటక ఆరోగ్యశాఖ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మంత్రి ఆరోగ్యమంత్రి అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చూడాలని ఆదేశించారు. బాధితుడి ఆఫీస్ వివరాలను తెలుసుకున్నారు, ఎవరితో సన్నిహితంగా మెలిగాడు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.