New Delhi, March 2: తెలంగాణలో (Telangana) మళ్లీ కరోనావైరస్ (COVID 19 Cases) కలకలం మొదలైంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి కరోనావైరస్ లక్షణాలు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఇటలీ నుంచి దిల్లీ వచ్చిన మరో ప్రయాణికుడు కూడా కరోనావైరస్ లక్షణాలను కనబరిచినట్లు తెలిసింది. వీరిద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని రిపోర్టులు వచ్చాయని అధికారులు వెల్లడించారు.
భారత్ లో రెండు కొత్త కరోనావైరస్ కేసులు నమోదైన విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ధ్రువీకరించింది. ప్రస్తుతం వీరిద్దరిని ప్రత్యేక వార్డుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని, వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే 66 దేశాలకు పైగా పాకిన కరోనావైరస్ ఇటలీ దేశంలో ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇప్పటివరకు అక్కడ 1500కు పైగా కేసులు నమోదు కాగా, 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత దుబాయ్, ఇరాన్ దేశాలలో కూడా ఈ వైరస్ ప్రభావం ఉంది. భారత్ లోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలలో కరోనావైరస్ స్క్రీనింగ్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే దుబాయ్, ఇటలీల నుంచి వచ్చిన ఇద్దరికీ వైరస్ లక్షణాలు కనిపించడంతో వీరిని వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందుకు బాధితులు వైరస్ అనుకూల ఫలితాలను చూపించారు.
Breaking: Two More Coronavirus Cases in India
Update on #COVID19:
Two positive cases of #nCoV19 detected. More details in the Press Release.#coronoavirusoutbreak #CoronaVirusUpdate pic.twitter.com/kf83odGo8f
— Ministry of Health (@MoHFW_INDIA) March 2, 2020
ఇంతకుముందు, భారతదేశంలో మూడు కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి - ఈ మూడు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఈ ముగ్గురు బాధితులు గత జనవరి -ఫిబ్రవరి కాలంలో చైనాలోని COVID-19 వైరస్ యొక్క కేంద్ర బిందువైన వుహాన్ నగరం నుండి తిరిగి వచ్చారు. అయితే ఒకనెల పాటు చికిత్స అనంతరం, వారి శరీరాలలో వైరల్ సంఖ్య గణనీయంగా తగ్గడంతో వైద్యులు వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇక తాజా రెండు కేసులను కలిపితే ఇప్పటివరకు 5 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.
కరోనావైరస్ వ్యాప్తి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు 88,000 మందికి పైగా వైరస్ బారినపడ్డారు. అయితే ఇందులో 90 శాతం పైగా మరణాలు చైనాలోనే నమోదయ్యాయి. ఇరాన్‌లో దాదాపు 50 మరణాలు సంభవించగా, ఫ్రాన్స్, ఇటలీ మరియు యునైటెడ్ స్టేట్స్‌లో కూడా కొన్ని మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కరోనావైరస్‌ను "గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ" గా ప్రకటించింది, దాని వ్యాప్తిని అరికట్టడానికి సంఘటిత విధానాన్ని కోరుతోంది. అయితే 60 ఏళ్లకు పైబడి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే రోగులకు మాత్రమే ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని వెల్లడించింది.