Konda Surekha Comments Row: కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం, లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్, ఫైర్ బ్రాండ్‌ని నిద్ర లేపి తన్నించుకుంటున్నారంటున్న కాంగ్రెస్, ఎవరేమన్నారంటే..
తనకు ఏ మాత్రం సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ తో పాటు, ఇతర అంశాలపై కొండా సురేఖ అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hyd, Oct 2: సినిమా హీరోయిన్లను ఉద్దేశిస్తూ తనపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనకు ఏ మాత్రం సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ తో పాటు, ఇతర అంశాలపై కొండా సురేఖ అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. సాక్ష్యాలు లేకుండా అసత్యాలు మాట్లాడారని దుయ్యబట్టారు.
గతంలో కూడా తన గురించి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని... ఆ వ్యాఖ్యలపై ఏప్రిల్ లో నోటీసులు పంపించానని కేటీఆర్ చెప్పారు. చట్ట పరంగా తాను స్పందించకుంటే... ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమని ప్రజలు భావించే ప్రమాదం ఉందని అన్నారు. తనకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని... లేకపోతే పరువునష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు వేస్తానని హెచ్చరించారు.
కేటీఆర్ వల్ల కొందరు హీరోయిన్లు ఇబ్బంది పడ్డారని... కొందరు త్వరగా పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారని కొండా సురేఖ అన్నారు. నాగార్జున కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలకు... సమంత, నాగచైతన్య విడిపోవడానికి కూడా కేటీఆరే కారణమని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్: కేటీఆర్ మీద మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలు అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై లీగల్‌గా ముందుకు వెళ్తామన్నారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు: మంత్రి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. కేటీఆర్ పట్ల కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ వాదనల్లో పసలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతారన్న మార్గరెట్ థాచర్ కోట్‌ను పోస్టుతో జతపరిచారు.
సునీతా లక్ష్మారెడ్డి : కొండా సురేఖపై జరిగిన ట్రోలింగ్‌ను ఒక మహిళగా తాము ఖండించామని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. కానీ బాధ్యతగల మంత్రిగా దిగజారి ఆమె మాట్లాడటం సరికాదన్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి అన్నారు. ఒక మహిళగా మరో మహిళను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి : ఇంట్లో ఉన్న కొండా సురేఖను రెచ్చగొట్టి మీరే తన్నించుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. కొండా సురేఖతో కొట్లాడటం అంత సులభం కాదన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ విషయంలో పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ పెద్దరికంగా వ్యవహారించాల్సి ఉండాల్సిందని అన్నారు. పార్టీకి చెందిన సోషల్ మీడియాను కంట్రోల్ చేయకపోవడం తప్పే అన్నారు.
ఆ తర్వాత పుండు మీద కారం చల్లినట్లు కేటీఆర్ మాట్లాడారని విమర్శించారు. అసలే మంత్రి (కొండా సురేఖ) ఫైర్ బ్రాండ్.. ఆమెను ఏమీ అనకుంటే ఎవరినీ ఏమీ అనబోరని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి కూడా ఆమె జోలికి ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు కొంచెం కూడా పరిజ్ఞానం లేకపోవడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు పదేళ్లు రాజభోగాలు అనుభవించారన్నారు.
మంత్రి సీతక్క: పనిగట్టుకొని తాము సినిమా వాళ్ల గురించి మాట్లాడలేదని, ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్లకు ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. సందర్భాన్ని బట్టి కొంతమంది సినిమా ప్రముఖులపై మాత్రమే కొండా సురేఖ మాట్లాడారన్నారు. సినీ నటులకు తాము వ్యతిరేకం కాదన్నారు. వాళ్లను తాము ద్వేషించడం లేదన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ... గతంలోని మహిళా మంత్రుల చరిత్ర, ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర అందరికీ తెలుసునన్నారు. తాము ప్రజల చేత ఎన్నుకోబడిన మంత్రులం అన్నారు.
ప్రజల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్లాట్లుగా మార్చి అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అన్నారు. కేటీఆర్ చాటుగా మాట్లాడటం కాదని, నేరుగా వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు. పండగపూట అనవసరంగా తమను విమర్శించవద్దని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. తాను, కొండా సురేఖ... సమ్మక్క, సారలమ్మ, రాణి రుద్రమదేవి ప్రాంతాల నుంచి వచ్చామన్నారు.