Lakhimpur Kheri: స్నేహితుడే అసలు సూత్రధారి, యూపీలో అక్కాచెళ్లెల్లపై అత్యాచారం, హత్య కేసులో ఆరుమంది అరెస్ట్, చెరుకుతోటకు తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారని తేల్చిన పోలీసులు
ఇద్దరు యువతులు చెట్టుకు వేలాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. దళిత వర్గానికి చెందిన అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి ఆ తర్వాత వారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
Lakhimpur Kheri, September 15: యూపీలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు యువతులు చెట్టుకు వేలాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. దళిత వర్గానికి చెందిన అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి ఆ తర్వాత వారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. లఖింపూర్ ఖేరీలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ ( Rape and Murder of Dalit Teenage Sisters) కనిపించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైకులపై వచ్చి తమ కూతుళ్లను కిడ్నాప్ చేశారని బాధితురాలి తల్లి ఆరోపించింది. అనంతరం, తన బిడ్డల కోసం వెతుకుతుండగా.. ఓ చోట పొలం వద్ద విగతజీవులుగా చెట్టుకు వేలాడుతూ కనిపించారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ కూతుళ్లు ఇద్దరిని.. దుంగడులు కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసిన తర్వాత ఇలా చెట్టుకు వేలాడదీశారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో యూపీ పోలీసులు ఆరు మంది యువకుల్ని అరెస్టు (Main Accused Chhotu Gautam and 5 Others Arrested) చేశారు. అందులో నలుగురు వ్యక్తులు ఆ దళిత అమ్మాయిల్ని ఉరివేసి చంపినట్లు తెలుస్తోంది. అరెస్టు అయిన వారిలో సుహేల్, జునైద్, హఫీజుల్ రెహ్మాన్, కరీముద్దిన్, ఆరిఫ్‌లతో పాటు చోటూ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ ఇద్దరు అమ్మాయిలకు చోటూ పరిచయస్తుడు. ఆ ఇద్దర్నీ ఆ యువకులకు అతనే పరిచయం చేశాడు.
సుహేల్, జునైద్‌లు ఇద్దరు అమ్మాయిల్ని చెరుకు తోటలోకి తీసుకువెళ్లినట్లు జిల్లా పోలీసు అధికారి సంజీవ్ సుమన్ తెలిపారు. పెళ్లి చేసుకోవాలని ఆ యువతులు వత్తిడి చేయడంతో.. వాళ్ల దుపట్టాతోనే ఆ ఇద్దరికి ఉరివేసినట్లు విచారణలో తేలింది. కరీముద్దీన్, ఆరిఫ్‌లు ఆ ఇద్దరికీ సహకరించినట్లు పోలీసులు తెలిపారు. రేప్, మర్డర్ చేసిన ఆ యువకులు.. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలను ఓ చెట్టుకు వేలాడదీశారని, ఆ ఇద్దరిదీ ఆత్మహత్య అనుకునేలా చెట్టుకు ఉరివేసినట్లు పోలీసులు తెలిపారు.
అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేయలేదని, కానీ ఇష్టపూర్వకంగానే ఆ యువకుల బైక్‌లపై వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయిదుగుర్ని బుధవారమే అరెస్టు చేశారు. ఒకర్ని ఇవాళ ఉదయం పట్టుకున్నారు. మర్డర్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కర్నీ అరెస్టు చేసినట్లు పోలీసు చీఫ్ సంజీవ్ శర్మ తెలిపారు. తన కూతుళ్లు ఇద్దరూ ఇంటి నుంచి బయలుదేరిన మూడు గంటల తర్వాత శవమై తేలినట్లు తల్లి ఆరోపించింది. ముగ్గురు యువకులు బలవంతంగా బైక్‌పై తన కూతుళ్లను తీసుకువెళ్లినట్లు ఆమె తెలిపింది.చెరుకు తోట వద్ద ఉన్న ఓ చెట్టుకు ఇద్దరి మృతదేహాలు వేలాడి ఉన్నాయి. చున్నీలతో ఇద్దర్నీ ఉరి తీశారు. అయితే వాళ్లకు గాయాలు అయినట్లు ఎక్కడా కనిపించడం లేదు. మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు తరలించే సమయంలో పోలీసుల్ని గ్రామస్తులు అడ్డుకున్నారు.
ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు స్పందించారు. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా.. ఇద్దరు దళిత అమ్మాయిలను కిడ్నాప్ చేసి, హత్య చేయడం దుర్మార్గమైన చర్య. లఖింపూర్‌లో గతంలో రైతుల దుర్ఘటన జరిగిన తర్వాత, ఇప్పుడు దళితులను చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. యూపీలో శాంతిభద్రతలు సరిగా లేవని ఆరోపించారు. గత ప్రభుత్వాలతో పోల్చితే యూపీలో మహిళలపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందని ప్రశ్నించారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లను చంపిన ఘటన ఆవేదనకు గురిచేసిందన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.