PM Modi Speech: 'లాక్ డౌన్ ముగిసిపోవచ్చు, కానీ కరోనావైరస్ ఇంకా అలాగే ఉంది.. తస్మాత్ జాగ్రత్త' ; పండగలు ముందున్న వేళ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కొవిడ్‌పై హెచ్చరించిన ప్రధాని మోదీ
ఇది సరైన పద్ధతి కాదు. మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ముసుగు లేకుండా బయట తిరగడం ద్వారా, మిమ్మల్ని మీరే కాకుండా మీ కుటుంబం, మీ పిల్లలు, వృద్ధులు మరియు సమాజాన్ని చాలా ప్రమాదంలో పడేస్తున్నారు....
New Delhi, October 20: గతంలో కరోనా అంటే ఆమడ దూరం పరుగెత్తిన ప్రజల్లో ఇప్పుడు ఆ వైరస్ అంటే అసలు భయమే లేకుండా పోయింది. మనకేం అవుతుందిలే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ 'జాగ్రత్తలు ఎక్కువగా పాటించే వారికే కరోనా సోకుతుంది' అంటూ ఇతరులను చెడగొట్టడం చేస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి ఇంకా ఉన్నప్పటికీ ప్రజలు పండగలు, ఇతర కార్యక్రమాలు, షాపింగ్స్ అంటూ గుంపులుగుంపులుగా సంచరిస్తున్నారు. చాలా మంది కనీసం మాస్క్ ధరించటానికే ఇబ్బంది పడుతున్నారు, ఇంకొకరిని వేసుకోనివ్వకుండా ప్రోత్సహిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీడియా ముందుకు వచ్చి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఇప్పుడు లాక్ డౌన్ లేకపోవచ్చు, కానీ కరోనావైరస్ ఇప్పటికీ ఉందనే విషయం ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. "ఈ పండుగ సీజన్లో, మార్కెట్లు మళ్లీ ప్రకాశవంతంగా కళకళలాడుతున్నాయి, లాక్డౌన్ ముగిసి ఉండవచ్చు, కాని కొవిడ్ -19 వ్యాప్తి ఇంకా కొనసాగుతుందదని గుర్తుంచుకోవాలి. గత 7-8 నెలలుగా ప్రతి భారతీయుడు చేసిన కఠిన ప్రయత్నాల ద్వారా ఇప్పుడిప్పుడే భారతదేశం స్థిరంగా కొవిడ్19 నుంచి కోలుకుంటోంది, ఈ పరిస్థితిని దిగజార్చవద్దు" అని మోదీ అన్నారు.
“ఇప్పుడు చాలా మంది అసలు కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవడమే మానేశారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ముసుగు లేకుండా బయట తిరగడం ద్వారా, మిమ్మల్ని మీరే కాకుండా మీ కుటుంబం, మీ పిల్లలు, వృద్ధులు మరియు సమాజాన్ని చాలా ప్రమాదంలో పడేస్తున్నారు" అని అన్నారాయన.
Watch PM's Speech
"ప్రస్తుతం మనం ఒక సంక్షోభ సమయాన్ని అధిగమించే దశలో ఉన్నాము. ఈ పండగల వేళ ఇంట్లో అందరూ ఉల్లాసంగా, ఆనందోత్సహాలతో గడిపే సమయం. మనం చేసే అతి చిన్న నిర్లక్ష్యం, మన ఆనందపు దారులను తారుమారు చేయవచ్చు. ఎప్పటివరకైతే వ్యాక్సిన్ లేదో, అప్పటివరకు కొవిడ్ నియంత్రణలో మన పట్టు సడలించవద్దు" అని మోదీ పేర్కొన్నారు.
అనేక దేశాలలో కరోనాకు మందు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి, మన దేశంలో కూడా జరుగుతున్నాయి. చూస్తుంటే సమీప భవిష్యత్తులో మనకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పటివరకు కొవిడ్ నియంత్రణలో విశ్రాంతి తీసుకోవద్దు. కొవిడ్19 ముప్పును తక్కువగా అంచనా వేయొద్దని ప్రధాని మోదీ ప్రజలను హెచ్చరించారు.
ముందున్న దసరా, దీపావళి, ఈద్ తదితర పండగ సమయాల్లో మాస్క్ ధరించటం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్లు వినియోగించటం తదితర కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రధాని నొక్కి చెప్పారు.