Machil Encounter: ఉగ్రదాడిలో అమరులైన తెలుగు బిడ్డలు, భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, ఒక సైనికాధికారి వీర మరణం, ఇద్దరు ఉగ్రవాదులు హతం
ఉత్తర కశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ)కు సమీపంలోని మచిల్ సెక్టార్‌లో అనుమానాస్పద కదలికలను గుర్తించిన పెట్రోలింగ్ బలగాలు నిఘాను పటిష్టం చేశాయి. శనివారం అర్ధరాత్రి ఉగ్రవాదులు మాచిల్ సెక్టార్ మీదుగా దేశంలోకి చొరబడేందుకు యత్నించారు. ఉగ్రవాదుల కదలికలను జవాన్లు గుర్తించి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు.
Kupwara, November 9: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మచిల్ వద్ద భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో (Machil Encounter) ముగ్గురు జవాన్లు, ఒక సైనికాధికారి వీర మరణం పొందారు. ఉత్తర కశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ)కు సమీపంలోని మచిల్ సెక్టార్‌లో అనుమానాస్పద కదలికలను గుర్తించిన పెట్రోలింగ్ బలగాలు నిఘాను పటిష్టం చేశాయి. శనివారం అర్ధరాత్రి ఉగ్రవాదులు మాచిల్ సెక్టార్ మీదుగా దేశంలోకి చొరబడేందుకు యత్నించారు. ఉగ్రవాదుల కదలికలను జవాన్లు గుర్తించి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో ఒక ఉగ్రవాదితో పాటు సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్‌ఎఫ్) చెందిన కానిస్టేబుల్ ఒకరు మరణించారు. సుమారు మూడు గంటలపాటు ఈ కాల్పులు కొనసాగినట్టు వెల్లడించారు. మరోవైపు, ఆదివారం ఉదయం 10.20 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు అదే ప్రాంతంలో మళ్లీ చొరబాట్లకు యత్నించడంతో సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులతోపాటు ఒక ఆర్మీ అధికారి (Indian Army Officer, 3 Soldiers) మరణించారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఈ ఉగ్రదాడిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సైనికులతో (Telugu States Soldiers) పాటు మరో ఇద్దరు సైనికులు కూడా అమరులయ్యారు. వీర మరణం పొందిన సైనికుల్లో ఒకరిని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లికి చెందిన ర్యాడా మహేశ్ (26) గా, మరో సైనికుడిని ఏపీలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రవీణ్‌కుమార్ రెడ్డి (37) గా గుర్తించారు.
ఈ ఘటనలో అమరుడైన మహేశ్ (Telangana Soldier) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శాంకరి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 2015లో ఆర్మీ జవాన్‌గా విధుల్లో చేరాడు. మహేశ్ 6వ తరగతి వరకు వేల్పూర్ మండలం కుకునూర్ ప్రభుత్వ పాఠశాలలో, 7-10వ తరగతి వరకు వేల్పూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. బాల్యం నుంచి దేశభక్తి భావాలు ఉన్న మహేశ్ ప్రత్యేక ఆసక్తితో ఆర్మీలో చేరారు. మహేశ్‌కు తల్లి ర్యాడ గంగు, తండ్రి గంగమల్లు, అన్న భూమేశ్ ఉన్నారు. మహేశ్ ఏడాది క్రితం సుహాసినిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఏడాది క్రితం ఇంటికి వచ్చి నెల రోజుల పాటు ఉండి వెళ్లాడు. మహేశ్ మృతి వార్త తెలియడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
అలాగే చీకల ప్రతాప్‌రెడ్డి, సుగుణమ్మ దంపతుల ఏకైక కుమారుడు ప్రవీణ్‌కుమార్ రెడ్డి. డిగ్రీ వరకు చదివాడు. గ్రామానికి చెందిన చాలామంది సైన్యంలో పనిచేస్తుండడం చూసి తాను దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. 18 ఏళ్ల క్రితం మద్రాసు రెజ్మెంట్–18లో (AP Soldier) చేరారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విధుల్లో చురుగ్గా ఉండేవాడు. ప్రస్తుతం ఆయన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమాండోగా పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో ఆదివారం జమ్మూకాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్ లోని మాచెల్ నాలా పోస్టు వద్ద దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను నిలువరించే ఆపరేషన్‌లో 15 మంది బృందంలో ఉన్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఆరుగురు ఉగ్రవా దులు జరిపిన దాడుల్లో ప్రవీణ్‌కుమార్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు భారత్ సైనికులు మృతిచెందారు. సంక్రాంతి పండుగకు వస్తానని చెప్పిన కొడుకు అనంతలోకాలకు చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రవీణ్ కుమార్‌రెడ్డికి భార్య, ఎనిమిదేళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. ఆయనకు భార్య రజిత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. హవల్దారుగా పనిచేస్తూ కమాండో ట్రైనింగ్ తీసుకున్నారు.
జవాన్ల వీర మరణంతో ఇరు గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలుముకొన్నాయి. మరోవైపు కశ్మీర్‌లో భారీగా ఉగ్రవాదులను పంపి శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, దాదాపు 50 మంది ఉగ్రవాదులు మాచిల్ సెక్టార్‌కు ఎదురుగా తిష్ఠవేసి ఉన్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. ముష్కరుల చొరబాటు యత్నాలను బలగాలు ఎప్పటికపుడు గుర్తించి తిప్పికొడుతున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.