Maharashtra Assembly Elections 2024: మహిళలకు ఫ్రీ బస్సు, ప్రతి నెలా రూ. 3వేలు, కుటుంబానికి రూ. 25లక్షల ఆరోగ్య బీమా..మహారాష్ట్ర ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ గ్యారెంటీలివే!
ముంబయిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు హామీలను ప్రకటించారు. మహిళలందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు ప్రతినెలా రూ.3వేలు చొప్పున ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు
Mumbai, NOV 06: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections 2024) గెలుపే లక్ష్యంగా విపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) కూటమి పలు కీలక హామీలు కురిపించింది. ముంబయిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు హామీలను ప్రకటించారు. మహిళలందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు ప్రతినెలా రూ.3వేలు చొప్పున ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. రాష్ట్రంలో మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే కిసాన్ సమృద్ధి యోజన కింద రైతులకు రూ.3లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ఎన్సీపీ (SP) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. సకాలంలో రుణం చెల్లిస్తే రూ.50వేలు ప్రోత్సాహకం ఇస్తామన్నారు.
Maharashtra Assembly Elections 2024
నిరుద్యోగ యువతకు నెలకు రూ.4వేలు చొప్పున భృతి చెల్లిస్తామని శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు. అలాగే, కుటుంబానికి రూ.25లక్షల వరకు ఉచిత వైద్య బీమా సదుపాయం కల్పిస్తామని నేతలు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో సైద్ధాంతిక పోరాటం నడుస్తోందన్నారు.
ఒక వైపు బీజేపీ-ఆరెస్సెస్ ఉండగా.. మరోవైపు ‘ఇండియా’ కూటమి ఉందన్నారు. మోదీ సర్కారు ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి సీబీఐ, ఈడీ, ఐటీలను ఉపయోగించి ప్రభుత్వాలను కూల్చేస్తుందని మండిపడ్డారు. గతంలో మహారాష్ట్రలో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం పతనమైన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ధారవిలో రూ.లక్ష కోట్ల విలువైన భూములను ప్రజల నుంచి లాక్కొని కోటీశ్వరులకు ఇస్తున్న విషయం రాష్ట్రం మొత్తానికి తెలుసన్నారు.