Who Is Ajit Pawar: అజిత్ పవార్ ఎవరు? అతని ప్రస్థానం ఏంటీ? అతనిపై ఉన్న ఆరోపణలు,కేసులు ఏంటీ? మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన అజిత్ పవార్ గురించి ప్రత్యేక కథనం
ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఎన్సీపీ (NCP), కాంగ్రెస్ (COngress) పార్టీలకు షాకిస్తూ బీజేపీ(BJP)ని అధికారం పీఠంపై కూర్చోబెట్టిన 60 ఏళ్ల అజిత్ పవార్ ఎన్సీపీ నేత, శరద్ పవార్ (Sharad Pawar) అన్న కుమారుడు. ట్విస్టుల మధ్య సాగుతున్న మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) కీ రోల్ పోషించి బీజేపీకి అధికారాన్ని అందించాడు. తమ అధినేత శరద్ పవార్‌ను ధిక్కరించి బీజేపీకి జై అన్నాడు.
Mumbai, November 23: అజిత్ పవార్ (Ajit Pawar).. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఎన్సీపీ (NCP), కాంగ్రెస్ (COngress) పార్టీలకు షాకిస్తూ బీజేపీ(BJP)ని అధికారం పీఠంపై కూర్చోబెట్టిన 60 ఏళ్ల అజిత్ పవార్ ఎన్సీపీ నేత, శరద్ పవార్ (Sharad Pawar) అన్న కుమారుడు. ట్విస్టుల మధ్య సాగుతున్న మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) కీ రోల్ పోషించి బీజేపీకి అధికారాన్ని అందించాడు. తమ అధినేత శరద్ పవార్‌ను ధిక్కరించి బీజేపీకి జై అన్నాడు.
ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చి, బీజేపీకి మద్దతు ప్రకటించి మహారాష్ట్ర రాజకీయాలకు ఊహకందని ట్విస్ట్ ఇచ్చాడు. ఇతని సపోర్టుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం (Devendra Fadnavis sworn in as Maharashtra CM) చేయగా డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ (Deputy CM Ajit Pawar) ప్రమాణం చేశారు.
డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సొంత అన్నయ్య అనంతరావ్ పవార్ కుమారుడే అజిత్ పవార్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ స్టూడియోస్’లో అనంతరావ్ పవార్ పని చేసేవారు. 1959లో జన్మించిన అజిత్ పవార్ కు విద్యా పరంగా ఎస్ఎస్సీ (మహారాష్ట్ర బోర్డు) సర్టిఫికెట్ ఉంది.
ఆ తర్వాత చదువును కొనసాగిస్తున్న సమయంలో ఆయన తండ్రి హఠాన్మరణం చెందారు. దీంతో, విద్యాభ్యాసాన్ని వదిలేసి, తన కుటుంబ బాధ్యతలను స్వీకరించారు. మహారాష్ట్ర మాజీ మంత్రి పదంసిన్హ్ పాటిల్ కుమార్తె సునేత్రను అజిత్ పవార్ పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో శరద్ పవార్ ఓ బలమైన నేతగా ఎదిగారు. 1982లో అజిత్ పవార్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1991లో పూణె జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ గా ఎన్నికై అదే పదవిలో ఏకంగా 16 సంవత్సరాలు కొనసాగారు. ఇదే సమయంలో బారామతి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. శరద్ పవార్ తర్వాత పార్టీ పీఠాన్ని అధిష్టించబోయేది అజిత్ పవార్ అని ఊహాగానాలు కూడా పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.
ఆ తర్వాత తన చిన్నాన్న శరద్ పవార్ కోసం బారామతి స్థానాన్ని త్యాగం చేశారు. అక్కడి నుంచి ఎంపీగా గెలుపొందిన శరద్ పవార్ పీవీ నరసింహారావు కేబినెట్ లో రక్షణ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత బారామతి ఎమ్మెల్యేగా అజిత్ పవార్ గెలుపొందారు. ఇదే స్థానం నుంచి వరుసగా 1995, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాల్లో పలు శాఖలకు మంత్రిగా పని చేశారు.
2012లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. జలవనరులశాఖ మంత్రి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో తన పదవీకి అజిత్ పవార్ రాజీనామా చేశారు. మరికొందరు మంత్రులతో రాజీనామా చేయించడంతో అశోక్ చవాన్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. దీంతో వెంటనే శరద్ పవార్ రంగంలోకి దిగారు. అజిత్‌ను ఒప్పించి.. ప్రభుత్వాన్ని కాపాడగలిగారు.
అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో 2019లో శరద్ పవార్ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దీంతో పవార్ అసెంబ్లీ స్థానం మావల్ నుంచి తన కుమారుడిని పోటీ చేయిస్తానని అజిత్ ప్రకటించారు. దీనిపై శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గారు. గత సెప్టెంబర్‌లో తన ఎమ్మెల్యే పదవీకి అజిత్ రాజీనామా చేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో బారామతి నుంచి పోటీచేసి గెలుపొందారు.
అజిత్ పవార్ మీద రెండు కేసులున్నాయి. మహారాష్ట్ర స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లో జరిగిన రూ. 25 వేల కోట్ల స్కాంలో పవార్ తో పాటు మరో 70 మందిపై ఆర్థిక నేరాల విభాగం (Economic Offences Wing (EOW) కింద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఆగస్టు 22 న బాంబే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఇక రెండవ కేసు కింద 2009 సంవత్సరంలో నిబంధనలను అతిక్రమించి ఆయన దాదాపు రూ. 20 వేల కోట్ల విలువైన ఇరిగేషన్ ప్రాజెక్టులకు (Maharashtra Irrigation Scam) అనుమతులు ఇచ్చారని ఆరోపణలున్నాయి. 1999 నుంచి 2009 వరకు మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా అజిత్ పవార్ వ్యవహరించారు. నిబంధనలను తోసిరాజని, విదర్భ నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ పాలకమండలి అనుమతి లేకుండానే ఈ టెండర్లను ఆయన ఆమోదించినట్లు చెబుతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల టెండర్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ.. రూ. 6వేల కోట్ల విలువైన 94 టెండర్లను అప్పటి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం రద్దుచేసింది
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తర్వాత అంతటి ప్రజాదరణ ఉన్న నేత అజిత్ పవార్ అని వీడీఏ అసోసియేట్స్ తెలిపింది. 2019 మహారాష్ట్ర ఎన్నికల సమయంలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ను ఆ సంస్థ మరోసారి వెల్లడించింది. తమ సర్వేలో మహారాష్ట్రలోని 32 శాతం మంది ఓటర్లు మళ్లీ ఫడ్నవిస్ సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అజిత్ పవార్ ను 11 శాతం మంది ఓటర్లు కోరుకున్నారని వెల్లడించింది. వీడీపీ అసోసియేట్స్ సర్వే ప్రకారం ఎవరికి ఎంత ప్రజాదరణ ఉందంటే (శాతాల్లో):
దేవేంద్ర ఫడ్నవిస్ - 32, అజిత్ పవార్ - 11, ప్రకాశ్ అంబేద్కర్ - 9, నితిన్ గడ్కరీ - 7, ఉద్ధవ్ థాకరే - 6, రాజ్ థాకరే - 5, అశోక్ చవాన్ - 4, చగన్ భుజ్ బల్ - 3, పృథ్విరాజ్ చౌహాన్ - 2, సుశీల్ కుమార్ షిండే - 1