JNU Violence: జెఎన్‌యూ యూనివర్సిటీపై గూండాల దాడి, ముసుగు వేసుకుని మరీ తలలు పగలకొట్టారు, దాడిని ఖండించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించిన హోమంత్రి అమిత్ షా, అసలు అక్కడ ఏం జరిగింది ?

ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాస్క్‌లు ధరించిన కొందరు క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్ధులు, ప్రొఫెసర్లను చితకబాదడంతో పాటు వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్‌ ఆయిషీ ఘోష్‌(Aishe Ghosh) సహా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Masked Mob Attacks JNU (Photo-ANI)

New Delhi, January 6: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో (Jawaharlal Nehru University) మాస్క్ ధరించిన గూండాలు క్యాంపస్ లోకి ప్రవేశించి ఎక్కడివారిని అక్కడే ఇష్టమొచ్చినట్లుగా(JNU Attack) కొట్టారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాస్క్‌లు ధరించిన కొందరు క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్ధులు, ప్రొఫెసర్లను చితకబాదడంతో పాటు వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్‌ ఆయిషీ ఘోష్‌(Aishe Ghosh) సహా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఘోష్‌ తల పగలడంతో ఆమెను ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. తమపై దాడికి తెగబడిన గూండాలు ఇప్పటికీ క్యాంపస్‌ హాస్టల్స్‌లోనే ఉన్నారని విద్యార్ధులు ఆరోపించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ముసుగు ధరించిన 50 మంది దుండగులు క్యాంపస్‌లోకి ప్రవేశించి హాస్టల్‌ రూమ్‌ల్లోకి చొరబడి విద్యార్ధులను చితకబాదారు. కనిపించిన ప్రొఫెసర్లపై సైతం వారు విరుచుకుపడ్డారు.

Here's Attack video

ఎవరికి వారే విమర్శలు

ఇదిలా ఉంటే ఈ అమానుష ఘటనకు మీరే కారణమంటూ వామపక్ష విద్యార్థి సంస్థ జేఎన్‌యూఎస్‌యూ,(JNUSU) బీజేపీ అనుబంధ ఏబీవీపీ (ABVP) పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. జేఎన్‌యూఎస్‌యూనే ఈ దాడికి పాల్పడిందని, ఈ దాడిలో తమ సభ్యులు పాతిక మందికి గాయాలయ్యాయని, మరో 11 మంది జాడ తెలియడం లేదని ఏబీవీపీ ఆరోపించింది.

Here's ANI Tweet

వామపక్ష విద్యార్థి సంస్థలు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ, డీఎస్‌ఎఫ్‌ విద్యార్థులు ఈ దాడుల వెనుక ఉన్నారని పేర్కొంది. ఇది ఏబీవీపీ గూండాల పనేనని, ముసుగులు వేసుకుని లాఠీలు, ఇనుప రాడ్‌లతో వారే ఈ దాడికి తెగబడ్డారని జేఎన్‌యూఎస్‌యూ పేర్కొంది.

మీరంటే మీరు దాడి చేశారు 

క్యాంపస్‌లో దుండగులు భయోత్పాతం సృష్టించినా పోలీసులు, సెక్యూరిటీ గార్డులు చోద్యం చూశారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు సాకేత్‌ మూన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

పోలీస్ బందోబస్త్ 

లాయర్‌ రాహుల్‌ మెహ్రా

ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల తరఫున లాయర్‌ రాహుల్‌ మెహ్రా ట్విటర్‌లో స్పందించారు. గూండాలు జేఎన్‌యూలోకి ప్రవేశించి.. అమాయకులైన విద్యార్థులపై దాడి చేస్తున్నప్పుడు పోలీసులకు ఎక్కడికి పోయారని ఆయన నిలదీశారు. ‘జేఎన్‌యూలో హింసకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ చూశాక ఢిల్లీ పోలీసు స్టాండింగ్‌ కౌన్సెల్‌ అయిన నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను.

Union Home Minister Amit Shah

గూండాలు యథేచ్ఛగా జేఎన్‌యూ క్యాంపస్‌లోకి ప్రవేశించి మారణహోమాన్ని సృష్టించారు. విద్యార్థులను తీవ్రంగా గాయపర్చి ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ తర్వాత క్యాంపస్‌ నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో బలగాలు ఏం చేస్తున్నాయి?’అంటూ ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్‌ ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ ఘటనలో ఎవరు దాడి చేశారో, ఎవరు బాధితులో అన్నది సందేహముంటే ఎబీవీపీ లేదా వామపక్షాల విద్యార్థుల్లో ఎవరికి తీవ్రమైన గాయాలయ్యాయన్న దానినిబట్టి దానిని తేల్చవచ్చునని పేర్కొన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్‌ కేజ్రీవాల్‌

జేఎన్‌యూ ఘటనపై ఢిల్లీ సీఎం, ఆప్‌ నేత అర్వింద్‌ కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే యూనివర్సిటీలో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్

తగిన చర్యలు తీసుకోవాలని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ను కోరానన్నారు. ‘జేఎన్‌యూ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యాను. విద్యార్థులను దారుణంగా కొట్టారు. యూనివర్సిటీ క్యాంపస్‌ల్లోనే మన విద్యార్థులకు రక్షణ లేకపోతే.. దేశం ముందుకు ఎలా వెళ్తుంది?’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

Lieutenant Governor of Delhi

కేంద్ర మంత్రుల ఖండన, అమిత్ షా ఆదేశాలు

జేఎన్‌యూలో హింసపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించారు. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని ఆదేశించారు. జేఎన్‌యూ మాజీ విద్యార్థులు, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్‌ జైశంకర్‌ జేఎన్‌యూలో జరిగిన హింసాత్మక ఘటనలను ఖండించారు.

నిర్మలా సీతారామన్ ట్వీట్ 

ఢిల్లీ పోలీసులు, జేఎన్‌యూ అధికారుల నుంచి మానవ వనరుల మంత్రిత్వ శాఖ వివరణ కోరింది. జేఎన్‌యూలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు దారుణమని, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిందిగా పోలీసులకు ఆదేశాలిచ్చామని ట్వీట్‌ చేశారు.

మోదీ- షా గూండాలు దేశాన్ని నాశనం చేస్తున్నారు: ప్రియాంకా వాద్రా

ఈ ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచ దేశాల్లో స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరొందిన ఇండియా ప్రతిష్టను మోదీ- షా గూండాలు నాశనం చేస్తున్నారంటూ మండి పడ్డారు. యూనివర్సిటీల్లో చొరబడి మెరుగైన భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న పిల్లలను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రియాంకా వాద్రా ట్వీట్ 

ఆస్పత్రికి వెళ్లి గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. అనంతరం ట్విటర్‌ వేదికగా నరేంద్ర మోడీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. పోలీసులు సైతం విద్యార్థులను చిత్ర హింసలకు గురిచేశారని ఆరోపించారు.

బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)అధినేత మాయావతి

జేఎన్‌యూలో జరిగిన దాడిపై న్యాయ విచారణ జరిపించాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)అధినేత మాయావతి విఙ్ఞప్తి చేశారు. యూనివర్సిటీలో దుండగుల దాడిని ఖండించిన మాయావతి సోమవారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘జేఎన్‌యూలో విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడి సిగ్గుచేటు. తీవ్రంగా ఖండించదగినది. ఈ పాశవిక చర్యకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోవడానికి.. దాడిపై న్యాయ విచారణ జరిపితే మంచిది’ అని ట్వీట్‌ చేశారు.

దాడిని ఖండించిన బాలీవుడ్‌

జేఎన్‌యూలో జరిగిన దుండగుల దాడిపై బాలీవుడ్‌ తారలు స్పందించారు. హీరోయిన్‌ స్వరా భాస్కర్‌, తాప్సీ పన్ను, షబానా అజ్మీ, రితేష్‌ దేశ్‌ముఖ్‌ ట్విటర్‌ వేదికగా ఈ హింసాత్మక దాడిని తీవ్రంగా ఖండించారు.ఈ దాడిని వ్యతిరేకిస్తూ జేఎన్‌యూ పూర్వ విద్యార్థి, నటి స్వరా భాస్కర్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం స్వరా భాస్కర్‌ తల్లి జేఎన్‌యూలో ఉంటూ.. ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. యూనివర్సిటీలోని విద్యార్థులకు సహాయం అందిచాలని తన తల్లిని కోరారు. ‘‘ఢిల్లీ వాసులకు అర్జెంట్‌ అప్పీల్‌. బాబా మంగ్నాథ్‌ మార్గంలోని ప్రధాన గేట్‌ బయట పెద్ద సంఖ్యలో గుమిగూడండి. ముసుగులో ఉన్న ఏబీవీపీ వాళ్లను అడ్డుకునేందుకు ప్రభుత్వంపై, పోలీసులపై ఒత్తిడి తీసుకురండి’’ అని కోరారు.

వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రమోద్‌ కుమార్‌

యూనివర్సిటీలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని, దాడికి పాల్పడిన దుండగులను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రమోద్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులంతా సంయమనం పాటించాలని అందులో కోరారు. వర్సిటీలో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.