Morbi Bridge Tragedy: మానవ నిర్లక్ష్యంతో ఘోర ప్రమాదం, 25 మంది వెళ్లాల్సిన చోట 500 మంది, మోర్బీ తీగల వంతెన ప్రమాదంలో తొమ్మిది మంది అరెస్ట్
గుజరాత్ రాష్ట్రం మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై బ్రిటిష్ కాలపు తీగల వంతెన కూలిపోయిన దుర్ఘటనలో (Morbi Bridge Tragedy) మృతుల సంఖ్య 132కు చేరింది.సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష సంఘ్వీ ఆదివారం రాత్రి నుంచి అక్కడే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Morbi, Nov 1: గుజరాత్ రాష్ట్రం మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై బ్రిటిష్ కాలపు తీగల వంతెన కూలిపోయిన దుర్ఘటనలో (Morbi Bridge Tragedy) మృతుల సంఖ్య 132కు చేరింది.సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష సంఘ్వీ ఆదివారం రాత్రి నుంచి అక్కడే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, త్రివిధ దళాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వంతెన కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటన జరిగిన సమయంలో వంతెనపై 500 మంది వరకు ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.
వంతనపై రద్దీ కారణంగానే కేబుల్ బ్రిడ్జి తెగిపోయిందని (Morbi Suspension Bridge Collapse) దేశ అత్యున్నత ఫోరెస్సిక్ లాబోరేటరీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటన జరిగిన అనంతరం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.బ్రిడ్జి నిర్వహణ కాంట్రాక్టును పొందిన అజంతా ఒరెవా కంపెనీపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఐపీసీ సెక్షన్ 304, సెక్షన్ 308 కింద కేసు పెట్టామన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ప్రధాన నిందితుడి స్థానంలో అజంతా కంపెనీ పేరు చేర్చామన్నారు.
పూర్తి వివరాలు బయటపెట్టేందుకు నిరాకరించారు. అరెస్టయిన 9 మందిలో అజంతా ఒవెరా గ్రూప్‌నకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు టిక్కెట్ బుకింగ్ క్లర్కులు ఉన్నారు. వీరిపై నేరపూరిత హత్యతో పాటు పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపినట్లు పేర్కొన్నారు.ఘటనపై పూర్తి సమాచారం అందిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకుంటామని రాజ్‌కోట్ రేంజ్ ఐజీ అశోకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
బ్రిడ్జికి ఫిట్‌నెట్ సర్టిఫికెట్ జారీ చేయలేదని మున్సిపల్ చీఫ్ ఆఫీసర్ సందీప్ సింగ్ చెప్పారు.
మున్సిపాలిటీ అనుమతి లేకుండానే దాన్ని పునఃప్రారంభించారని తెలిపారు. ‘‘వంతెనపైకి 20–25 మందిని ఒక గ్రూప్‌గా అనుమతిస్తుంటారు. కానీ నిర్వాహక సంస్థ అజంతా ఒరెవా నిర్లక్ష్యంగా ఒకేసారి దాదాపు 500 మందిని వెళ్లనిచ్చింది. అదే ఘోర ప్రమాదానికి దారి తీసింది’’ అన్నారు. మరమ్మతుల కారణంగా గత మార్చిలో మూసివేయగా.. ఐదు రోజుల కిందట ప్రజల సందర్శనార్థం తెరిచారు.
అయితే, 15 సంవత్సరాల పాటు వంతెన నిర్వహణ బాధ్యతలను ఒరేవా కంపెనీ ఇవ్వగా.. ఈ ఏడాదిలోనే మోర్బీ మున్సిపల్, కంపెనీకి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2037 వరకు చెల్లుబాటులో ఉండనున్నది. అధికారుల అనుమతి లేకుండానే వంతెనను పునరుద్ధరించారని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయలేదని, పెద్ద మొత్తంలో ఇంతకు ముందు వంతెనపైకి సందర్శకులు వెళ్లలేదని తెలిపారు.