Citizenship: షాకింగ్ న్యూస్.. భారత్ వద్దని పౌరసత్వాన్ని వదులుకున్న 1.6 లక్షల మంది ప్రవాస భారతీయులు, గత ఐదేళ్లలో ఇదే అత్యధికం, వివరాలను వెల్లడించిన MHA
గత ఐదేళ్లలో ఇదే అత్యధికమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం లోక్‌సభకు (MHA in Lok Sabha) లిఖితపూర్వకంగా తెలిపింది.
New Delhi, July 21: ఈ దేశంలో పుట్టి విదేశాల్లో సైటిలైన ప్రవాస భారతీయులు స్వదేశీ పౌరసత్వాన్ని (Citizenship) వదులుకునేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన గణాంకాలు ప్రకారం.. 2021లో 1.6 లక్షల మంది పైగా భారతీయులు (More Than 1.6 Lakh Indians) తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. గత ఐదేళ్లలో ఇదే అత్యధికమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం లోక్‌సభకు (MHA in Lok Sabha) లిఖితపూర్వకంగా తెలిపింది. వీరిలో గతేడాది 78,284 మంది ఇండియన్స్ అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే.. ఇతర దేశాల్లో ఉంటూ స్వదేశీ పౌరసత్వం వదులుకున్న వారిలో (Renounced Their Citizenship in 2021) అమెరికా ఎన్నారైలే అత్యధికంగా ఉండటం విశేషం.
ఇదిలా ఉంటే ద్వంద్వ పౌరసత్వాన్ని భారతదేశం అనుమతించదు. దీంతో విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసులు ఒక దేశ పౌరసత్వం మాత్రమే కలిగి ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు స్వదేశీ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇక వ్యక్తిగత కారణాల వల్లే స్వదేశీ పౌరసత్వాన్ని ప్రవాసులు వదులుకున్నారని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. 2018లో కేంద్ర హోం శాఖ పౌరసత్వ నిబంధనలను సవరించింది.
విదేశీ పౌరసత్వాన్ని పొందడం, భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవడానికి సంబంధించిన కాలమ్‌ను దరఖాస్తులో పొందుపరిచింది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు హాజీ ఫజ్లుర్ రెహ్మాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ విషయం తెలిపారు.
చైనాలో నివసిస్తున్న 362 మంది భారతీయులు కూడా స్వదేశీ సిటిజన్‌షిప్‌ను వదులుకుని చైనా పౌరసత్వం ఉంచుకున్నారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయుల్లో 23,533 మంది, కెనడా నుంచి 21,597 మంది స్వదేశీ పౌరసత్వం వదులుకున్నారు. బ్రిటన్(14,637), ఇటలీ(5,986), నెదర్లాండ్స్ (2187), న్యూజిలాండ్( 2643), , సింగపూర్(2516), పాకిస్తాన్(41) నేపాల్(10) తదితర దేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఆయా దేశాల పౌరసత్వాలను స్వీకరించారు. భారత పౌరసత్వం వదులుకున్న వారిలో 103 దేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఉన్నారని కేంద్ర హోంశాఖ గణాంకాలు వెల్లడించాయి