National Cyber Crime Reporting Portal: ఆన్‌లైన్ మోసాలపై ఫిర్యాదు చేసేందుకు వెబ్ పోర్టల్ ప్రారంభించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, సైబర్ నేరాలను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన కిషన్ రెడ్డి
ఎవరైనా అందులోకి లాగిన్ అయి నేరుగా తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చునని మంత్రి స్పష్టం చేశారు....
New Delhi, February 5: ప్రజలు ఆన్‌లైన్ మోసాలకు గురికాకుండా నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి పార్లమెంటులో తెలిపారు. ఆన్‌లైన్, ఫోన్ మోసాలకు చెక్ పెట్టేలా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ , ఆర్థిక సేవల విభాగం, టెలికమ్యూనికేషన్ విభాగం, బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థల సభ్యుల అనుబంధంతో ప్రభుత్వం ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసిందని లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ కమిటీకి FCORD-FICN కోఆర్డినేషన్ ఏజెన్సీ సెంట్రల్ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది మరియు దేశంలోని ప్రతి రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
ఈ ఆన్‌లైన్ మోసాలకు సంబంధించి మరింత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో సైబర్ క్రైమ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కల్పించినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇక ఆన్‌లైన్ మోసాలకు గురైన బాధితులు లేదా ఏదైనా ఆన్‌లైన్ మోసంపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in ను ప్రారంభించింది. ఎవరైనా అందులోకి లాగిన్ అయి నేరుగా తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చునని మంత్రి స్పష్టం చేశారు. డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటూ ఆన్‌లైన్ వల, పెళ్లి పేరుతో మోసం
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాల ప్రకారం, 2017లో 3,466 మరియు 2018లో 3,353 ఆన్‌లైన్ మోసాలు నమోదయ్యాయి. ఆన్‌లైన్ మోసాలకు గురయ్యేవారిలో నిరక్షరాస్యులే కాకుండా ఉన్నత చదువులు చదివిన వారూ అధికంగా ఉండటం గమనార్హం.