Nirbhaya Case: న్యాయవ్యవస్థకు నిర్భయ దోషుల పరీక్షలు, సుప్రీంకోర్టులో మరో క్యురేటివ్ పిటిషన్ దాఖలు, ఫిబ్రవరి 1న శిక్ష అమలు సాధ్యమయ్యేనా?
ఆమె పేగులు బయటకు వచ్చి భరించలేని నొప్పితో విలవిలలాడింది.....
New Delhi, January 29: న్యాయస్థానంలో న్యాయదేవత కళ్లు మూసుకున్నట్లు, దోషులకు శిక్షల అమలు విషయంలో న్యాయస్థానాలు కూడా కొంతకాలం పాటు కళ్లుమూసుకుంటే బాగుంటుందేమో అనేది సామాన్య పౌరుడి అభిలాష. దేశ రాజధాని నడిబొడ్డున, దిల్లీలో ఏడేళ్ల క్రితం 'నిర్భయ' (Nirbhaya) అనబడే ఒక 23 ఏళ్ల ఆడపిల్లను 6గురు సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా, మానవత్వమే మరిచి ఇనుపరాడ్లతో ఆమె పట్ల అత్యంత జుగుప్సాకరమైన చర్యలకు పాల్పడ్డారు. ఆమె పేగులు బయటకు వచ్చి భరించలేని నొప్పితో విలవిలలాడింది. 2012 డిసెంబర్ 16న ఆమెపై ఈ క్రూరమైన, అత్యంత భయంకరమైన అత్యాచారం (2012 Delhi Gang Rape) జరిగితే, ఆసుపత్రిలో రెండు వారాల పాటు చావుబ్రతుకులతో పోరాడి డిసెంబర్ 29, 2012న ఆమె తుదిశ్వాస విడిచింది. వ్యవస్థపై విచారం వ్యక్తం చేసిన నిర్భయ తల్లి
ఆ ఆరుగురు పట్టుబడి జైల్లో ఉన్నారు. అందులో ఒకడు మైనర్ అని మూడేళ్లకే విడుదలయ్యాడు, మరొకడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇంకా మిగిలిన నలుగురు తీహార్ జైల్లో నివాసం ఉంటున్నారు. ఏడాది క్రితం ఉరిశిక్ష పడింది. కొన్ని రోజుల క్రితం డెత్ వారెంట్ వాయిదా పడింది. ఫిబ్రవరి 1న వారిని ఉరి తీయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇది కూడా సందేహంగానే మారింది. శిక్ష అమలులో 'దోషుల పక్షంగా' కాకుండా 'బాధితుల పక్షంగా' విచారణ జరిగేలా సుప్రీంకోర్టుకు వినతి
నలుగురు దోషుల్లో ఒక్కొక్కడు విడివిడిగా న్యాయపరంగా ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటున్నారు. ఒక్కడికి ఉరి ఆగినా సరే, మిగిలిన వారికీ ఆగిపోతుంది. ఉరిశిక్షను సవాల్ చేస్తూ ముఖేశ్ సింగ్ అనే దోషి సుప్రీంకోర్టులో పెట్టుకున్న రివ్యూ పిటిషన్లు, క్యురేటివ్ పిటిషన్లు అన్ని అయిపోయాయి. రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా రద్దైంది. ఉరిశిక్ష అమలుకు మరో రెండు రోజులు ఉందనగా మరొక దోషి అక్షయ్ సింగ్ కుమార్ తనకు న్యాయపరంగా ఉన్న అవకాశాన్ని వినియోగించుకుంటూ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ వేశాడు. ఈరోజు సుప్రీంకోర్ట్ దీనిపై విచారణ జరిపే అవకాశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్ట్ తిరస్కరించినా, అతడికి రాష్ట్రపతి క్షమాభిక్ష అవకాశం మిగిలే ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న వారి ఉరిశిక్ష అమలు అవుతుందా? లేదా మరోసారి వాయిదా పడుతుందా? అనేది చూడాలి.
తనకు ఉన్న అన్ని అవకాశాలు అయిపోయిన తర్వాత ముఖేశ్ సింగ్ 'నాపై జైల్లో అత్యాచారం జరిగింది, దానిపై విచారించండి' అంటూ కోర్టులో పిటిషన్ పెట్టుకున్నాడు. అంతేకాకుండా తన క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి సైతం కేవలం నాలుగు రోజుల్లోనే తిరస్కరించారు. దీనిపై సరైన విచారణ చేయలేదు, అలాగే జైల్లో లైంగిక దాడులు జరిపిన రికార్డులు జైలు అధికారులు రాష్ట్రపతికి పంపలేదు అని చెబుతూ ఏకంగా రాష్ట్రపతి తన క్షమాభిక్షను తిరస్కరించటాన్ని సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్ట్ లో పిటిషన్ వేశాడు.
దీనిపై బుధవారం విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం, ముఖేశ్ పిటిషన్‌కు ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేస్తూ అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. జైల్లో బాధను అనుభవించినంత మాత్రానా దానిని ఆధారంగా క్షమాభిక్షను సమీక్షించలేం అని అని తేల్చి చెప్పింది. రాష్ట్రపతి నిర్ణయాన్ని సమీక్షించడం సరైంది కాదని పేర్కొంది. కేంద్ర హోంశాఖ అన్ని పరిశీలించే ముఖేశ్ పిటిషన్‌ను రాష్ట్రపతికి పంపింది. ముఖేశ్ మానసికంగా, శారీరకంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న రికార్డులు సమర్పించినట్లు సొలిసిటర్ జనరల్ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది.
ఇలా నిర్భయ దోషులు న్యాయపరమైన అవకాశాలను, లొసుగులను ఉపయోగించుకుంటూ న్యాయవ్యవస్థకే పరీక్షలు పెడుతున్నారు. ఉరితీత సమీపిస్తున్న తరుణంలో మీ చివరి కోరిక ఏమిటని జైలు అధికారులు ప్రశ్నించినపుడు, ఎవ్వరూ కూడా నోరు మెదపలేదు. మాకు ఉరిశిక్ష పడదు అనే కాన్ఫిడెన్స్ ను ప్రదర్శించారని జైలు అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.