New Delhi, January 23: 2012 నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసు (Nirbhaya Case)లో దోషుల ఉరితీత ఆలస్యం (Execution Delay) అవడం పట్ల కేంద్ర హోంశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇకపై 7 రోజుల్లోనే ఉరిశిక్ష అమలు ప్రక్రియ పూర్తి అయ్యేలా చట్టాల్లో మార్పులను సవరిస్తూ సుప్రీంకోర్టుకు కొన్ని మార్గదర్శకాలతో అభ్యర్థనను దాఖలు చేసింది. శిక్ష అమలుకు సంబంధించి ఇకపై బాధితుల పక్షాన విచారణలు జరగాలి అని తమ అభ్యర్థనలో కేంద్రం పేర్కొంది.
నిర్భయ ఘటన జరిగి ఇప్పటికే 7 ఏళ్లు దాటిపోయింది, ఏడాది క్రితమే దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. అయినప్పటికీ ఉరిశిక్షను సవాల్ చేస్తూ దోషులు హైకోర్టులో, సుప్రీంకోర్టుల్లో రివ్యూ పిటిషన్లు, ఆ తర్వాత క్యురేటివ్ పిటిషన్లు , మళ్లీ రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్లు, ఆపై ఉరి అమలు పొడగించాలంటూ హైకోర్టులో పిటిషన్లు, ఇవన్నీ అయిపోయిన తర్వాత తాము మైనర్లమని, జువైనల్ చట్టాల ప్రకారం తమపై విచారణ చేయాలంటూ దోషులు అన్ని రకాల చావు తెలివితేటలు చూపించారు. న్యాయ వ్యవస్థలో ఉన్న అవకాశాలతో శిక్ష నుంచి తప్పించుకోటానికి ఎన్నో ఎత్తుగడలు వేశారు. ఈ క్రమంలో శిక్ష అమలు వాయిదా పడుతూ పోయింది.
నిర్భయ తల్లి ఏడేళ్లుగా చేస్తున్న పోరాటం మీడియాలో చూసిన ఎంతో మందికి కన్నీళ్లు పెట్టించింది, 'మన న్యాయ వ్యవస్థ నేరస్థులనే ఎక్కువ వింటుంది. బాధితుల గోడు వినిపించుకోదు' అని ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకమే పోయింది. 'దిశ ఘటన' లో తెలంగాణ పోలీసులు చేసిందే కరెక్ట్ అని ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్ధతు లభించింది.
ఈ నేపథ్యంలో ప్రజలకు చట్టాలపై విశ్వాసం, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉండేలా ప్రస్తుత ఉన్న మార్గదర్శకాలలో మార్పు అవసరం అని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో దోషులకు శిక్ష అమలు, వారి పిటిషన్ల విచారణల అన్నింటికీ ఒక నిర్ధిష్ఠ కాలపరిమితిని నిర్ణయించడం అవసరం అని కేంద్ర హోంశాఖ సుప్రీంను కోరింది.
ANI Update:
The Ministry of Home Affairs today moved an application before the Supreme Court praying for modification of the "convict-centric" guidelines and to make them "victim-centric" to reinforce the people's faith in the rule of law. pic.twitter.com/e9cpm0JSrB
— ANI (@ANI) January 22, 2020
కేంద్రం తమ అభ్యర్థనలో తాజాగా చేర్చిన మార్గదర్శకాలలో భాగంగా దోషులకు డెత్ వారెంట్ జారీ చేయబడిన తర్వాత, దోషులు పెట్టుకునే 'క్షమా' పిటిషన్లన్నింటికీ 7 రోజుల గడువు మాత్రమే ఉండేలా కాలపరిమితి ఫిక్స్ చేయాలని సుప్రీంను కోరింది. సుప్రీంకోర్ట్ కేంద్రం ప్రతిపాదించిన మార్గదర్శకాలకు ఆమోదం తెలిపితే, ఇకపై ఇలాంటి కేసుల్లో శిక్ష అమలుపై దోషుల పక్షాన కాకుండా, బాధితుల పక్షంగా విచారణలు జరగనున్నాయి.
నిర్భయ దోషులకు జనవరి 7న డెత్ వారెంట్ జారీ చేయబడింది. జనవరి 22న ఉరితీత అమలు చేయాల్సింది. చివరికి వచ్చేసరికి క్షమాభిక్షల పేరుతో దోషుల తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్లతో డెత్ వారెంట్ మార్చాల్సి వచ్చింది. కోర్ట్ ఆ తర్వాత ఫిబ్రవరి 1న శిక్ష అమలు తేదీని నిర్ణయించింది.
కాగా, ఉరి తీయబోతున్న నేపథ్యంలో చివరి కోరిక ఏమిటని నిర్భయ దోషులను అడగగా వారి నుంచి ఎలాంటి సమాధానం లేదు, వారేం కోరుకోవడం లేదని జైలు అధికారులు వెల్లడించారు. ఇప్పటికీ తాము శిక్ష నుంచి బయటపడతామనే ఆశతోనే వారు ఉన్నట్లు పేర్కొన్నారు.