Nirbhaya Case: నిర్భయ దోషుల ఉరితీత విషయంలో ట్విస్టులు, అదే రోజు ఉరితీయడం సాధ్యం కాకపోవచ్చంటున్న తీహార్ జైలు అధికారులు, అయినప్పటికీ దోషి రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన దిల్లీ కోర్ట్
Nirbhaya Case - Representational Image |(Photo-ANI)

New Delhi, January 15: నిర్భయ గ్యాంగ్ రేప్ మరియు హత్య కేసు (Nirbhaya Case)లో దోషులు తమ మరణశిక్ష తప్పించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు వేయని ఎత్తుగడ లేదు. ఈ క్రమంలో దిల్లీలోని ట్రయల్ కోర్ట్ జారీ చేసిన డెత్ వారెంట్ (Death Warrant) ప్రకారం జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయడం కుదరకపోవచ్చునని దిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ కేసులో దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం అభ్యర్థన సమర్పించాడు. కాబట్టి అతడి విధిరాత రాష్ట్రపతి నిర్ణయం తర్వాతనే నిర్ణయించబడుతుందని దిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది రాహుల్ మెహ్రా కోర్టు (Delhi High Court) కు విన్నవించారు. రాష్ట్రపతి ఒకవేళ అతడి క్షమాభిక్షను తిరస్కరించినా, నిబంధనల ప్రకారం దోషి మరణ శిక్ష అమలుకు 14 రోజుల నోటీస్ పీరియడ్ ఉంటుందని మెహ్రా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో ఉన్న కొన్ని అనుకూలతలతో చట్టాన్ని సైతం పరీక్షించే విధంగా ఇది దోషులు వేసిన ఎత్తుగడగా మెహ్రా అభివర్ణించారు.

చివరి న్యాయపరమైన అవకాశంగా నిర్భయ దోషులు పెట్టుకున్న క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్ట్ మంగళవారం కొట్టివేసింది. దీంతో ఒక దోషి ముఖేశ్ సింగ్ రాష్ట్రపతి క్షమాభిక్షను అభ్యర్థనను పెట్టుకున్నాడు. రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు 'మరణశిక్ష అమలు' ను వాయిదా వేయాలని దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అందరికీ ఒకేసారి మరణశిక్ష అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఒక్కడి కారణంగా మిగతావారికి శిక్ష ఆలస్యం అవుతుంది.

అయితే ముఖేశ్ సింగ్ పెట్టుకున్న రివ్యూ పిటిషన్ ను దిల్లీ హైకోర్ట్ తిరస్కరించింది. అంతకుముందు ట్రయల్ కోర్ట్ ఇచ్చిన డెత్ వారెంట్ తీర్పులో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పింది. ఒక్కోదోషికి ఒక్కోరకమైన నిబంధనలు అంటూ ఏమి ఉండవు అని కోర్ట్ పేర్కొంది.

ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో దోషులకు జనవరి 22న అమలు శిక్ష అవుతుందా అనే దానిపై సస్పెన్స్ నెలకొని ఉంది. దీనిపై నిర్భయ తల్లి మాట్లాడుతూ రాష్ట్రపతి వెంటనే అతడి క్షమాభిక్షను రద్దు చేయాలని కోరారు. వారు ఏ కోర్టుకు వెళ్లినా, ఎవరి వద్దకు వెళ్లిన ముందుగా జారీచేసిన వారెంట్ ప్రకారం జనవరి 22, ఉదయం 7 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో వారిని ఉరితీయాల్సిందేనని, అందులోని ఎలాంటి మార్పులు ఉండకూడదని ఆమె కోరుకుంటున్నారు.