Hyderabad, December 06: నవంబర్ 27న రాత్రి 9:45 సమయంలో హైదరాబాద్ శివారులోని శంషాబాద్, ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో తొండుపల్లి టోల్ ప్లాజాకు దగ్గర ఒంటరిగా, నిస్సహాయ స్థితిలో ఉన్న 26 ఏళ్ల వెటర్నరీ డాక్టర్ దిశ (Disha)ను లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేసే మహమ్మద్ పాషా అలియార్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్ మరియు చింతకుంట చెన్నకేశవులు అనబడే నలుగురు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసి ఆమె మృతదేహాన్ని తెల్లవారు ఝామున 3 గంటల సమయంలో పెట్రోల్ పోసి తగలబెట్టారు.
సరిగ్గా 9 రోజులకు డిసెంబర్ 6, శుక్రవారం తెల్లవారు ఝామున 3 గంటలకే ఆ నలుగురు నిందితులు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం యాదృచ్ఛికం. ఈ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను పోలీసులు అత్యంత రహస్యంగా ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అయితే పోలీసులపై రాళ్లు రువ్వి, ఆయుధాలు లాక్కోనే ప్రయత్నం చేయగా ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ఆ నలుగురు హతమయ్యారు. శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి 5:30 వరకు ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం. సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) ఎన్‌కౌంటర్ (Encounter) జరిగిన చోటుకు చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఆనందం వ్యక్తం చేసిన దిశ కుటుంబ సభ్యులు
ఇక, తమ కుమార్తెపై దారుణానికి తెగబడ్డ ఆ నలుగురు మృగాలు ఎన్‌కౌంటర్ అవడం పట్ల దిశ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఆ నలుగురిని చంపి తమకు ఇంత తొందరగా న్యాయం చేసినందుకు హైదరాబాద్ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
దిశ తండ్రి మాట్లాడుతూ " నా కూతురు చనిపోయి 10 రోజులవుతుంది. వారిని ఎన్‌కౌంటర్ చేసి మాకు న్యాయం చేసిన పోలీసులకు మరియు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము, ఇప్పుడు మా బిడ్డ ఆత్మకు శాంతి చేకూరి ఉంటుంది. మాకు మద్ధతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.
RIP Disha, says her father:
My daughter's soul at peace now: Hyderabad veterinarian's father on encounter
Read @ANI story | https://t.co/pTLxgCcSV3 pic.twitter.com/SizszIrRw8
— ANI Digital (@ani_digital) December 6, 2019
" ఈ ఎన్‌కౌంటర్ నా బిడ్డకు శాంతి, మాకు కొంత ఊరటను కలిగించింది. నా బిడ్డ కొవ్వొత్తిలా కరిగిపోయి ఈ దేశానికి వెలుగునిచ్చింది, ఇలాంటి ఘటనలు ఇంకెప్పుడూ జరగకూడదు" అని దిశ తల్లి పేర్కొంది.
"ఈ ఎన్‌కౌంటర్ తో నైనా అలాంటి మృగాలకు తప్పు చేయాలంటే భయం కలుగుతుందని భావిస్తున్నా, టీఎస్ ప్రభుత్వానికి , పోలీసులకు థాంక్స్ " అని దిశ సోదరి పేర్కొంది.
ఇక 'నిర్భయ' తల్లి కూడా స్పందించారు. నాకు చాలా సంతోషంగా ఉంది, వారికి న్యాయం చేకూరిందని నిర్భయ తల్లి పేర్కొన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు కూడా ఆమె స్పందించారు. 'నా మరో కుమార్తె కూడా మరోసారి అన్యాయానికి గురయ్యారు' అని ఆమె స్పందించారు.
ఇక టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, నాగార్జునలు స్పందిస్తూ దిశకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక సీపీఐ నేత నారాయణ ఈ ఎన్‌కౌంటర్ ను సమర్థించారు.
కాగా, తెలంగాణ పోలీసుల చర్యను దేశంలో మెజారిటీ వర్గాలు హర్షిస్తున్నాయి. హైదారాబాద్ నుంచి దిల్లీ వరకు చాలా చోట్ల కాలేజీ, స్కూల్ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకున్నారు. తెలంగాణ పోలీస్ శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Locals Praise Telangana Cops:
#WATCH Hyderabad: Neigbours of the woman veterinarian, celebrate and offer sweets to Police personnel after the four accused were killed in an encounter earlier today pic.twitter.com/MPuEtAJ1Jn
— ANI (@ANI) December 6, 2019
అయితే కొన్ని వర్గాలు మాత్రం తప్పుపడుతున్నాయి. ఈ చర్య మానవ హక్కుల ఉల్లంఘన అని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని వారు చెప్తున్నారు.