Hyderabad, December 06: హైదరాబాద్ యువ వెటర్నరీ డాక్టర్ దిశ (Disha) అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు (The 4 Accused) తెలంగాణ పోలీసులు (Telangana Police) చేపట్టిన ఎన్‌కౌంటర్ (Encounter) లో మృతి చెందినట్లు శుక్రవారం ఉదయం నివేదికలు తెలిపాయి. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాద్‌నగర్ సమీపంలో ఉన్న చటాన్‌పల్లి వంతెన దగ్గర దిశ ఘటన సన్నివేశాన్ని నిందితులచే పునర్ చిత్రీకరింపజేసే సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసి తప్పించుకోడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నలుగురిని పోలీసులు కాల్చి వేసినట్లు నివేదికలు చెప్తున్నాయి. నిందితులు దిశను ఎక్కడైతే కాల్చారో ఇప్పుడు అదే చోట వారు కూడా కాల్చివేయబడ్డారు. అయితే ఈ వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు.
నవంబర్ 27 రాత్రి హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్, ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో 26 ఏళ్ల వెటర్నరీ డాక్టర్ దిశను లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేసే నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తరువాత వారు ఆమె మృతదేహాన్ని షాద్ నగర్ పట్టణం, చటాన్‌పల్లి వంతెన కింద పడవేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరాన్నే కాదు, యావత్ దేశాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.
నవంబర్ 29న సైబరాబాద్ పోలీసులు ఈ ఘటనతో సంబంధమున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు - ఇద్దరు ట్రక్ డ్రైవర్లు మరియు ఇద్దరు క్లీనర్లుగా గుర్తించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఏకకాలంలో పోలీసులు ఈ నలుగురి ఇంటికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్క ఫోన్ కాల్ వీరిని పట్టించింది.
ఈ నలుగురు నిందితులకు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు తెలంగాణ హైకోర్టు బుధవారం ఆమోదం తెలిపింది. ఇక ఏ కోర్టుతో పనిలేకుండా శుక్రవారం వరకే ఆ నలుగురు ఎన్‌కౌంటర్ అయ్యారు.