Nirbhaya Case: ఉరి తప్పింది మరోసారి! నిర్భయ దోషుల ఉరిశిక్షపై స్టే విధించిన దిల్లీ కోర్ట్, దోషి పవన్ గుప్తా క్షమాభిక్ష అభ్యర్థన రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటమే కారణం

ఈరోజు ఈ విషయంపై తీర్పును రిజర్వ్ చేసే ముందు నిర్భయ కేసు దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ పై దిల్లీ కోర్ట్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.....

2012 Delhi Gang Rape Case Convicts.| (Photo-IANS File Photo)

New Delhi, March 2: నిర్భయ దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. దోషులు ఒక్కొక్కరుగా తమ న్యాయపరమైన అవకాశాలను చివరి క్షణంలో ఉపయోగించుకుంటున్న క్రమంలో దోషుల ఉరితీత ఆలస్యం అవుతోంది. అంతకుముందు దోషులు అక్షయ్, ముఖేశ్ కారణంగా రెండు సార్లు వాయిదా పడగా, తాజాగా పవన్ గుప్తా ఉరిశిక్ష మరికొద్ది గంటలు ఉందనగా రాష్ట్రపతి క్షమాభిక్ష కోరడంతో దిల్లీ కోర్ట్ మార్చి 03న అమలు చేయాల్సిన అమలుపై స్టే విధించింది.

ఈ కేసులో నలుగురు దోషులకు మరికొన్ని గంటల్లో మార్చి 03, మంగళవారం ఉదయం 06 గంటలకు ఉరితీత అమలు జరగబోతుందనగా, పవన్ గుప్తా ఒకవైపు తన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ వేస్తూనే మరోవైపు రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. ఆ వెంటనే దిల్లీ కోర్టులో తాను రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టుకున్నానని, తన పిటిషన్ ప్రెసిడెంట్ కోవింద్ వద్ద పెండింగ్ లో ఉంది కాబట్టి, ఆ తీర్పు వచ్చే వరకు ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశాడు. కాగా, క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్ట్ తోసి పుచ్చగా, దిల్లీ కోర్ట్ దోషి పిటిషన్ ను విచారించి, రాష్ట్రపతి నిర్ణయం కోసం తీర్పును రిజర్వ్ చేసింది.

అటు తర్వాత పవన్ క్షమాభిక్ష పిటిషన్ కేంద్ర హోంశాఖకు చేరింది,  హోంశాఖ దీనిని రాష్ట్రపతి కార్యాలయానికి పంపించింది. ప్రస్తుతం దోషి క్షమాభిక్ష రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది.

క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉండటంతో దిల్లీ కోర్ట్ మార్చి 03న అమలు చేయాల్సిన ఉరిపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు స్టే అమలులో ఉంటుందని పేర్కొంది.   పరిస్థితులు మళ్ళీ తారుమారవుతాయా అని సర్వత్రా అనుమానాలు

మార్చి 03న దోషుల ఉరితీత సాధ్యం కాకపోవచ్చనే అనుమానాలు ముందు నుంచే ఉన్నాయి. ఎందుకంటే ఒకరి క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించినప్పటికీ కూడా ఆ దోషికి తాను పెట్టుకున్న క్షమాభిక్ష తిరస్కరణకు గురైందని సమాచారం ఇచ్చి, మరణశిక్ష విధించడానికి 14 రోజులు నోటీసు ఇవ్వాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనతోనే నిర్భయ దోషులు ఒక్కొక్కరు చివరి నిమిషంలో రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టుకొని ఉరిశిక్ష అమలును వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇందులో చివరగా ఇప్పుడు పవన్ వంతు వచ్చింది.

ఈరోజు ఈ విషయంపై తీర్పును రిజర్వ్ చేసే ముందు నిర్భయ కేసు దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ పై దిల్లీ కోర్ట్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్లు దరఖాస్తు చేసుకోవడంలో ఎందుకు ఆలస్యం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని కోర్ట్ ఆయనపై మండిపడింది.