New Delhi, March 2: 2012 నిర్భయ సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో (Nirbhaya Case) దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం తిరస్కరించింది. తనకు పడిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ గత వారం పవన్ గుప్తా ఈ క్యురేటివ్ పిటిషన్ వేశాడు. ఉరిశిక్ష అమలు చేసేందుకు (Execution) మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో సుప్రీం, అతడి అభ్యర్థనను తోసిపుచ్చింది. నిర్భయ కేసులో దోషులకు మార్చి 03, మంగళవారం ఉదయం 06 గంటలకు ఉరితీయాలని ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి, అందుకోసం తీహార్ జైల్లో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే రేపటి ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే పవన్ కుమార్ గుప్తాకు ఇంకా రాష్ట్రపతి క్షమాభిక్ష అవకాశం మిగిలే ఉంది.
ఉరిశిక్ష అమలు జరిగే చివరి నిమిషంలో మిగతా దోషులు రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టుకోవడంతో ఇప్పటికే రెండు సార్లు ఉరితీత వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రేపు దోషుల ఉరితీత అమలు అవుతుందా? లేక మరోసారి వాయిదా పడుతుందా? రేపటి వరకు పరిస్థితులు మళ్ళీ తారుమారవుతాయా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 'నేనొక మానసిక రోగిని, ఉరితీయకూడదు' నిర్భయ దోషి వినయ్ శర్మ; స్పృహ తప్పిన న్యాయమూర్తి
ఈ కేసు 2012 నాటిది, ఆ ఏడాది డిసెంబర్ 16 రాత్రి కదిలే బస్సులో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై ఆరుగురు దారుణంగా హింసించి, సామూహిక అత్యాచారం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిర్భయ ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసుతో సంబంధమున్న ఆరుగురిలో ఒకడు జైల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, ఇంకొకడు మైనర్ కావడంతో మూడేళ్లకు విడుదలయ్యాడు. ఇక మిగిలిన నలుగురిలో ముగ్గురు ముఖేష్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ ఉరిశిక్ష నుంచి బయటపడేందుకు అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకున్నారు. ఈ ముగ్గురి క్షమాభిక్ష అభ్యర్థనలను కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు.
అయితే అక్షయ్ మరోసారి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు, అంతకుముందు పెట్టుకున్న పిటిషన్ లో లాయర్ తనకు సంబంధించిన వివరాలు అస్పష్టంగా పేర్కొన్నారని తాజా పిటిషన్ లో పేర్కొన్నాడు. అయితే అక్షయ్ అభ్యర్థనపై సోమవారం విచారణ జరిపిన దిల్లీ కోర్ట్, అతడి పిటిషన్ను తోసిపుచ్చింది. ఉరితీతపై స్టే విధించాలన్న అతడి అభ్యర్థనను దిల్లీ కోర్ట్ సోమవారం మధ్యాహ్నం కొట్టివేసింది.
ఇక పవన్ గుప్తాకు మరో అవకాశం మిగిలే ఉన్నందున అతడు రాష్ట్రపతి క్షమాభిక్ష కోరితే మార్చి 03న ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడుతుందా? లేదా? అనేది మరికొద్ది సేపట్లో తేలిపోనుంది.