New Delhi, February 14: తాను పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను (Mercy Petition) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నిర్భయ కేసులో మరణశిక్ష పడిన దోషుల్లో ఒకడైన వినయ్ కుమార్ శర్మ (Vinay Kumar Sharma) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం కొట్టివేసింది.
ఈ పిటిషన్ పై గురువారమే విచారణ జరగగా శుక్రవారానికి తీర్పును రిజర్వ్ చేశారు. ఈ క్రమంలో ఈరోజు జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్ భానుమతి, ఎ.ఎస్.బొపన్నలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం వినయ్ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది. "గౌరవనీయ రాష్ట్రపతి నిర్ణయాన్ని జోక్యం చేసుకోవడంలో మాకు ఎటువంటి ఆధారం లేదు" అని ధర్మాసనం పేర్కొంది
వినయ్ శర్మ తనకు పిచ్చి ఉంది, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాను. కాబట్టి నాకు మరణశిక్ష విధించరాదని వాదనలు వినిపించాడు. అయితే ఆ వాదనను కూడా సుప్రీం తోసిపుచ్చింది. వినయ్ మెడికల్ రిపోర్ట్స్ అన్ని అతడి ఆరోగ్యం బాగున్నట్లే సూచించాయని పేర్కొంది. డెత్ వారెంట్ జారీ చేయాలంటూ నిర్భయ పేరేంట్స్ పిటిషన్
ఇదిలా ఉండగా, ఉత్తర్వులు వెలువరిస్తున్న సమయంలో ప్యానెల్ లోని న్యాయమూర్తి ఆర్.భానుమతి ఒక్కసారిగా ఉన్నచోటే స్పృహ తప్పిపోయారు. అయితే కాసేపటికే తేరుకున్న ఆమెను సహాయక సిబ్బంది వీల్ చైర్ లో చికిత్స కోసం కోర్టులోని ఛాంబర్ హాలుకు తరలించారు. అనంతరం ఛాంబర్ నుంచే న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీచేశారు.
23 ఏళ్ల నిర్భయను, 2012 డిసెంబర్ 16 రాత్రి, దేశ రాజధానిలో నడుస్తున్న బస్సులో సామూహిక అత్యాచారం జరిపడమేకాకుండా, క్రూరమైన చర్యలకు పాల్పడి బాధితురాలిని బస్సు నుంచి విసిరివేశారు. వారం పాటు చావుతో పోరాడిన నిర్భయ సింగపూర్ ఆసుపత్రిలో మరణించారు.
ఇక 2012లో జరిగిన ఈ ఘటనలో ఇప్పటికీ దోషులు రకరకాల కేసులు వేస్తూ తమ శిక్ష అమలును వాయిదా వేసుకుంటున్న నేపథ్యంలో పలువురు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. దేశంలో ఇప్పటికే చాలా మందికి భారత న్యాయవ్యవస్థ మీద నమ్మకం పోయింది, అయితే క్రిమినల్స్ కు మాత్రం మన న్యాయవ్యవస్థ మీద సంపూర్ణ నమ్మకం ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు.