Nirbhaya Case: ఉరితీతపై కింది కోర్టులకు స్వేచ్ఛ కల్పించిన సుప్రీంకోర్ట్, నిర్భయ దోషులకు నోటీసులు జారీ, శిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ ఓ దోషి పిటిషన్, డెత్ వారెంట్ జారీ చేయాలంటూ నిర్భయ పేరేంట్స్ మరో పిటిషన్
2012 Delhi Gang Rape Case Convicts.| (Photo-IANS File Photo)

New Delhi, February 11: నిర్భయ కేసులో ( 2012 Nirbhaya Gang Rape & Murder Case) నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ కుమార్ శర్మ మరోసారి సుప్రీంకోర్టును  (Supreme Court) ఆశ్రయించాడు. తాను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశాడు. తొందరపాటులో రాష్ట్రపతి తన అభ్యర్థనను సరైనరీతిలో పరిశీలించకపోయి ఉండవచ్చునని పిటిషన్ లో పేర్కొన్నాడు. తన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ వినయ్ శర్మ తన న్యాయవాది ఎపి సింగ్ ద్వారా కోర్టుకు విన్నవించుకున్నాడు.

ఉరిశిక్ష నుంచి మినహాయింపు కోరుతూ వినయ్ శర్మ ఇప్పటికే తనకున్న చట్టపరమైన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకున్నాడు. చిట్టచివరి అవకాశం అయిన క్షమాభిక్ష అభ్యర్థనను కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫిబ్రవరి 1న తిరస్కరించారు. ఈ కేసులో నలుగురు దోషుల్లో ముగ్గురు వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేశ్ సింగ్ లు తమకున్న చట్టపరమైన అవకాశాలన్నీ ముగిసిపోయాయి. ఒక్క పవన్ గుప్తా ఒక్కడికే మరొక్క అవకాశం మిగిలిఉంది. ఈ నేపథ్యంలో వీరి ఉరితీత అమలు ఇప్పటికే రెండు సార్లు వాయిదాపడింది. దోషులు తమకున్న చట్టపరమైన అవకాశాలన్నీ వినియోగించుకునేందుకు ఫిబ్రవరి 05న దిల్లీ హైకోర్ట్ దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది. దీంతో దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ వీరి ఉరిశిక్ష అమలును పొడగించేందుకు పొంతనలేని, అర్థం లేని మరియు అర్హత లేని పిటిషన్లను న్యాయస్థానంలో దాఖలు చేస్తూ పోతున్నారు.

ఇక ఈకేసులో దోషులను వేర్వేరుగా ఉరితీసేందుకు నిబంధనలు లేవని దిల్లీ హైకోర్ట్ పేర్కొనడంతో, ఈ తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం మరియు దిల్లీ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దోషులు దేశం సహనాన్ని పరీక్షిస్తున్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. హైదరాబాద్ దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను ప్రజలు ప్రశంసిస్తున్నారు, కాబట్టి చట్టపరమైన అవకాశాలు పూర్తయినవారికి ఉరి అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.

ఈ పిటిషన్లపై సుప్రీంకోర్ట్  స్పందించింది, డెత్ వారెంట్ జారీచేసే అంశంలో ట్రయల్ కోర్టులను ఆశ్రయించేందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు సుప్రీం పేర్కొంది.  ఈ క్రమంలో నిర్భయ దోషులూ తమ స్పందన తెలియజేయాలంటూ సుప్రీం వారికి మంగళవారం నోటీసులు జారీ చేసింది.

ఇదిలా ఉండగా నిర్భయ తల్లిదండ్రులు కూడా మరోసారి కోర్టును ఆశ్రయించారు. దోషులకు వెంటనే డెత్ వారంట్ జారీచేసి వారిని ఉరితీయాలంటూ పాటియాల కోర్టులో మంగళవారం పిటిషన్ వేశారు. వీరి పిటిషన్ పై బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది.