INX Media Case: చిదంబరంకు మళ్లీ తప్పని నిరాశ. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్ట్. ఒకవైపు సీబీఐ మరోవైపు ఈడీ కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న మాజీ కేంద్ర మంత్రి.

తాజాగా ED కేసులో తన అభ్యర్ధనను సుప్రీం కోర్ట్ కొట్టివేసిన తరువాత, తనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం మరియు రిమాండ్ కు తరలించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన పెట్టుకున్న పిటిషన్ ను చిదంబరం తనకుతానుగా ఉపసంహరించుకున్నారు...

Congress leader P Chidambaram. (Photo Credits: PTI)

New Delhi, September 05: INX మీడియా కేసుకు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం (P. Chidambaram) తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీం కోర్ట్ (Supreme Court) గురువారం తిరస్కరించింది. ముందస్తు బెయిల్ కోసం చిదంబరం ఇదివరకే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఢిల్లీ హైకోర్ట్ ఆయన పిటిషన్ ను తిరస్కరిండంతో, హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ జరిపిన ఆర్. భానుమతి మరియు ఎ.ఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం తాము ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేం అని తేల్చి చెప్పింది. ముఖ్యంగా ఆర్థిక నేరాలకు సంబంధించి ముందస్తు బెయిల్ ఆశించే హక్కు ఉండదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కాగా, ఈ కేసులో ఇప్పటికే సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేసి ఉన్నారు. తాజాగా ED కేసులో తన అభ్యర్ధనను సుప్రీం కోర్ట్ కొట్టివేసిన తరువాత, ఇక తనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం మరియు రిమాండ్ కు తరలించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన పెట్టుకున్న మరో పిటిషన్ ను చిదంబరం తనకుతానుగా ఉపసంహరించుకున్నారు.

చిదంబరం ప్రస్తుతం సీబీఐ అదుపులోనే ఉన్నారు. చిదంబరం రిమాండ్ పై విచారణ కోసం సీబీఐ అధికారులు ఆయనను ట్రయల్ కోర్టులో హాజరుపరచనున్నారు.

ఇప్పటికే చిదంబరం సీబీఐ కస్టడీలో 15 రోజులు గడిపారు. ఈ మేరకు ఆయన సాధారణ బెయిల్ కోసం సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఒకవేళ అక్కడ కూడా బెయిల్ లభించకపోతే, చిదంబరంను జ్యుడీషియల్ కస్టడీ కోసం తిహార్ జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు తాజా సుప్రీం కోర్టు ఉత్తర్వుతో, ఇటు ఈడీ కూడా చిదంబరంను తమ అదుపులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉంది.