Pariksha Pe Charcha 2020: టీచర్ అవతారం ఎత్తిన నరేంద్ర మోదీ, విద్యార్థులకు జీవిత పాఠాలు, పరీక్షల కోసం చిట్కాలు.. 'పరీక్ష పే చర్చ' ముఖాముఖి కార్యక్రమంలో తన అనుభవాలను, అభిప్రాయాలను ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
దానికి బదులు చెప్తూ, పాఠ్యేతర కార్యకలాపాలు లేకపోతే మనిషి రోబోట్ లాగా తయారవుతాడు, జీవితం యాంత్రికంగా మారుతుందని మోదీ అన్నారు....
New Delhi, January 20: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తన 'పరీక్ష పే చర్చ 2020' / Pariksha Pe Charcha 2020 ( పరీక్షల మీద చర్చ) కార్యక్రమం యొక్క మూడవ ఎడిషన్ లో సోమవారం పాల్గొన్నారు. విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి, పరీక్ష వేళ్లల్లో సాధారణంగా ఉండే ఒత్తిడిని ఎలా జయించాలి? అనే విషయాలపై విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో ముఖాముఖి చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని సావధానంగా సమాధానం ఇస్తూపోయారు, ఒత్తిడిని జయించటానికి కొన్ని చిట్కాలను చెప్పారు. అలాగే విజయం సాధించడం అంటే ఏంటి అనే అంశపై మోదీ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ పరీక్ష పే చర్చలో భాగంగా ఓ విద్యార్థి మాట్లాడుతూ 'అసలు పరీక్షల సమయంలో చదవడానికి ఆసక్తి సన్నగిల్లితే లేదా పరీక్షలకు సన్నదమయ్యేందుకు సరైన ప్రేరణ లభించకపోతే ఏం చేయాలి' ? అని ప్రశ్న అడిగాడు.
దీనికి ప్రధాని మోదీ జవాబు చెప్పుతూ.. అపజయాలు కలిగినపుడు నిరాసక్తత, ప్రేరణ దొరకకపోవడం జీవితంలో చాలా సార్లు ఎదురయ్యే సవాల్లే, ఉదాహారణకు చంద్రయాణ్-2 మిషన్ కోసం అందరూ రాత్రంతా మేల్కొని కష్టపడ్డారు, అయినా ఆశించిన ఫలితం రాకపోవడంతో మనమంతా నిరాశ చెందాం. కానీ ఆ తర్వాత కూడా మన ప్రయత్నాలను ఆపలేదు, వైఫల్యాలు రావడం జీవితంలో మామూలే' అని మోదీ జవాబిచ్చారు. మరో ఉదాహరణ చెబుతూ ఒకప్పుడు ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగేటపుడు టీమిండియా వరుస ఎదురుదెబ్బలను ఎదుర్కొంది. 2001లో ఈడెన్ గార్డెన్స్ లో జరిగి టెస్టు మ్యాచ్ లో ఇండియా ఫాలో ఆన్ ఆడుతుంది. దాదాపు ఓటమి ఖాయమైపోయినా, ద్రవిడ్- లక్ష్మణ్ ఏ మాత్రం నిరాశ చెందకుడా పట్టుదలతో ప్రయత్న చేసి భారత్ కు విజయాన్ని సాధించి పెట్టారు. తాత్కాలిక ఎదురుదెబ్బలు మన విజయాలను ఆపలేవు అని చెప్పేందుకు ఆ విజయమే నిదర్శనం' అని మోదీ పేర్కొన్నారు.
చదువుతో పాటు పాఠ్యేతర కార్యకలాపాల (extra-curricular activities) ప్రాముఖ్యత గురించి ముగ్గురు విద్యార్థులు మోదీని ప్రశ్నించారు. దానికి బదులు చెప్తూ, పాఠ్యేతర కార్యకలాపాలు లేకపోతే మనిషి రోబోట్ లాగా తయారవుతాడు, జీవితం యాంత్రికంగా మారుతుందని మోదీ అన్నారు. పిల్లలు దేనినైతే ఇష్టపడతారో, దేనిపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తారో ఆ రంగంలో వారికి ఇప్పట్నించే మంచి ప్రోత్సహం అందించాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ప్రధాని మోదీ సలహా ఇచ్చారు.