PM Narendra Modi: 'ఉగ్రవాదంతో సామ్రాజ్యాలు సృష్టించే విధ్వంసక శక్తులు ఎక్కువకాలం ఆధిపత్యం చెలాయించలేరు, వారి ఉనికి శాశ్వతం కాదు', ప్రాధాన్యత సంతరించుకుంటున్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు
భయపెట్టే ధోరణితో వారు కొంతకాలం పాటు...
New Delhi, August 20: విధ్వంసక శక్తులు మరియు ఉగ్రవాదం ద్వారా సామ్రాజ్యాలను సృష్టించుకోవాలనే సిద్ధాంతాన్ని అనుసరించే వ్యక్తులు ఎంతో కాలం ఆధిపత్యం చెలాయించలేరని, వారి ఉనికి శాశ్వతం కాదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భయపెట్టే ధోరణితో వారు కొంతకాలం పాటు మనుషులపై ఆదిపత్యాన్ని ప్రదర్శించవచ్చు అయితే మానవత్వాన్ని శాశ్వతంగా అణచివేయలేరని మోదీ అన్నారు.
గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ పుణ్యక్షేత్రంలో పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబాన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో మోదీ పరోక్షంగా వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.
మోదీ మాట్లాడుతూ.. '' సోమనాథ్ ఆలయం చాలాసార్లు ధ్వంసం చేయబడింది, దేవుని విగ్రహాలు అనేకసార్లు అపవిత్రం చేయబడ్డాయి, ఆలయ ఉనికిని సైతం తుడిచిపెట్టే ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్రతి విధ్వంసక దాడి తర్వాత కూడా సోమనాథ్ ఆలయం పునర్వైభవంతో విరాజిల్లుతూ వస్తుంది".
"విధ్వంసం కోసం ప్రయత్నించే శక్తులు మరియు టెర్రర్ ద్వారా సామ్రాజ్యాలను స్థాపించే వారు కొంతకాలం పాటు ఆధిపత్యం చెలాయించవచ్చు, కానీ మానవత్వం శాశ్వతంగా అణచివేయడటం సాధ్యపడనందున వారి ఉనికి ఎప్పటికీ శాశ్వతం కాదు" అని మోదీ అన్నారు.
గతంలో సోమనాథ్ దేవాలయం ధ్వంసం అవడం నిజమే, అదే ఆలయం నేటికీ వైభవంగా పూజలందుకుంటుందీ నిజమే. మనం మన గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి, పునర్నిర్మాణం దిశగా ముందుడగు వేయాలి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
దేశంలో పర్యాటక రంగాన్ని బలోపేతంచేస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ట్రావెల్ అండ్ టూరిజం పోటీ సూచికలో 2013లో ప్రపంచంలో 65వ స్థానంలో ఉన్న భారతదేశం 2019లో 34వ స్థానానికి ఎగబాకిందని ప్రధాని గుర్తుచేశారు. కాగా, ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయరూపాని, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వాని తదితరులు పాల్గొన్నారు.