Kartarpur Corridor: కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించిన మోడీ, పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన ఇండియా పీఎం, గురు నానక్ దేవ్ అన్ని పుణ్య క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైలు సేవలు
సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోని డేరాబాబా నానక్ దగ్గర భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Prime Minister Modi ) కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించారు.
New Delhi, November 9: భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండగా..రెండు దేశాలను కలిపే కర్తార్‌పూర్ కారిడార్ (Kartarpur Corridor) ప్రారంభం ఎట్టకేలకు ప్రారంభం అయింది. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోని డేరాబాబా నానక్ దగ్గర భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Prime Minister Modi ) కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించారు.
ఈ సంధర్భంగా కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణం కోసం సహకరించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్( Imran Khan)కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కృతజ్ఞతలు తెలిపారు. పాక్ ప్రధానితో పాటు పంజాబ్ ప్రభుత్వం, ఎస్‌జీపీసీతో పాటు కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణం(Kartarpur Sahib corridor)లో కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. డేరా బాబా నానక్ మందిరంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రార్థనలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రార్థనలు
ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్,కేంద్రమంత్రులు హర్ దీప్ సింగ్ పూరీ, హర్ సిమ్రత్ కౌర్ బాదల్,నటుడు,గురుదాస్ పూర్ ఎంపీ సన్నీడియోల్ సహా పలువురు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రారంభోత్సవంలో ప్రధాని , మాజీ ప్రధాని
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. గురునానక్ 550వ జయంతికి ముందుగానే కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గురు నానక్ దేవ్ జీ ఆశీర్వాదం, ప్రభుత్వ దృఢ నిశ్చయంతో కార్తార్ పూర్ కారిడార్ ఓపెన్ చేయబడిందని మోడీ అన్నారు. వేలాది మంది ప్రజలు పవిత్ర తీర్థయాత్రకు వెళతారని ఆయన అన్నారు. కాగా ఈ నెల 12వ తేదీన గురునానక్ 550వ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు.
సిక్కుల మత గురువు గురు నానక్‌కు చెందిన గురుద్వారా దర్బార్ సాహిబా (Gurdwara Darbar Sahib) ప్రస్తుతం పాకిస్థాన్ (Pakistan)లో ఉన్నది. అయితే ప్రతి రోజూ 5 వేల మంది సిక్కులు ఆ గురుద్వార్ కు వెళ్లేందుకు పాక్ అనుమతి ఇచ్చింది. గురు నానక్ (Guru Nanak Dev) తన చివరి 18 ఏళ్ల జీవితాన్ని గురుద్వారా దర్బార్ సాహిబ్‌లోనే గడిపారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న నరోవల్ జిల్లాలో ఈ గురుద్వారా ఉన్నది. ఇది అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న విషయం తెలిసిందే.
పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోడీ
గురు నానక్ దేవ్‌కి సంబంధించిన అన్ని పుణ్య క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైలు సేవలను ప్రారంభించనున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. అమృత్‌సర్, కేశ్‌ఘర్, ఆనంద్‌పూర్, డామ్‌డమ, పాట్నా, నాందేడ్‌లలోని సిక్కు పవిత్ర క్షేత్రాలను కలుపుతూ రైల్వేశాఖ కొత్త రైళ్లను నడపనున్నట్టు ఆయన పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్, లద్దాక్‌లలో ఆర్టికల్ 370 రద్దుతో సిక్కులకు విశేష లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలంతా దేశ ప్రజలతో సమానంగా హక్కులను పొందుతారన్నారు.