Bharat Jodo Yatra: రాహుల్‌తో కలిసి నడిచిన ఆర్బీఐ మాజీ గవర్నర్, దేశ ఆర్ధిక వ్యవస్థపై ఇరువురి మధ్య చర్చ, భారత్ జోడో యాత్రలో ఆసక్తికర సన్నివేశం
రాజస్థాన్ భడోటిలోని సవాయ్ మందిర్ నుంచి ఈ ఉదయం రాహుల్ యాత్ర మొదలైంది. అక్కడి నుంచి కొద్ది దూరం వరకు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. ఈ సమయంలో పలు అంశాలపై ఇద్దరు చాలా సేపు చర్చించుకున్నారు.
Jaipur, DEC 14: కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ లో యాత్ర నిర్వహిస్తున్నారు. అయితే ఈ యాత్రలో ఆయనకు పలువురు ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలతో పాటూ పలు రంగాలకు చెందిన వ్యక్తులు రాహుల్‌తో (Rahul Gandhi) కలిసి భారత్ జోడో యాత్రలో నడిచారు. తాజాగా ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ (RBI Governor Raghuram Rajan) కూడా రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. రాజస్థాన్ భడోటిలోని సవాయ్ మందిర్ నుంచి ఈ ఉదయం రాహుల్ యాత్ర మొదలైంది. అక్కడి నుంచి కొద్ది దూరం వరకు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. ఈ సమయంలో పలు అంశాలపై ఇద్దరు చాలా సేపు చర్చించుకున్నారు.
ప్రస్తుతం దేశ ఆర్ధిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో రఘురాం రాజన్ ఇలా జోడో యాత్రలో దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర... జమ్ముకశ్మీర్‌లోని కశ్మీర్‌లో పూర్తికానున్నది. ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో రాహుల్ భారత్ జోడో యాత్ర పూర్తయ్యింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో యాత్ర కొనసాగుతున్నది.