Rahul Gandhi Supports YS Sharmila: వైయస్ షర్మిలకు అండగా నిలిచిన రాహుల్ గాంధీ, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులను తీవ్రంగా ఖండించిన రాహుల్
మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికి పందల చర్య.
New Delhi, FEB 04: ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. మరో రెండుమూడు నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో.. అన్ని పార్టీల అధిష్టానాలు అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టాయి. అంతేకాక.. అధికార వైసీపీతోపాటు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ (TDP), జనసేన, బీజేపీలు తమ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేస్తున్నాయి. మరోవైపు, ఈసారి ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీకూడా కీలకంగా మారబోతోంది. వైఎస్ షర్మిల (YS Sharmila) ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఇప్పటికే జిల్లాల వారిగా పర్యటిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నేతలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో తనదైనశైలిలో ప్రసంగాలు చేస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. షర్మిల ప్రధానంగా అధికార వైసీపీతోపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు.
ముఖ్యంగా ఏపీ సీఎం, ఆమె సోదరుడు జగన్ మోహన్ రెడ్డిని (YS Jaganmohan reddy) రాష్ట్రంలోని సమస్యలపై ప్రశ్నిస్తున్నారు. జగన్ టార్గెట్ గా షర్మిల ప్రసంగాలు ఉంటుండంతో వైసీపీ నేతలుసైతం షర్మిలపై (Malicious Campaign Against Ys Sharmila) విమర్శల దాడికి దిగితున్నారు. ఈ క్రమంలో ఒకానొక దశలో షర్మిల వర్సెస్ వైసీపీ నేతలు అన్నట్లుగా ఏపీ రాజకీయాలు మారిపోయాయి. ఇదే సమయంలో కొందరు సోషల్ మీడియాలో షర్మిలపై దుష్ప్రచారం చేస్తున్నారు. షర్మిలతోపాటు సీఎం జగన్ మరో సోదరి సునీతారెడ్డిపైనా అసభ్యకర రీతిలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో సునీత హైదరాబాద్ సైబ్ క్రైమ్ పోలీసులకుసైతం ఫిర్యాదు చేశారు. తనను చంపుతామంటూ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. షర్మిల, సునీతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా ఖండించారు.
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila), సునీతా రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విష ప్రచారాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా ఖండించారు. మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికి పందల చర్య. దురదృష్టవశాత్తూ ఇటీవల కాలంలో ఇది శక్తిహీనులకు ఒక ఆయుధంగా మారిపోయింది. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై జరిగిన ఈ అవమానకరమైన దాడిని నేనూ, కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా ఖండిస్తున్నాం అంటూ రాహుల్ ట్వీట్ లో పేర్కొన్నారు.