Rahul Gandhi's Disqualification As MP: రాహుల్ గాంధీపై అనర్హత వేటు, అసలు మోదీ ఇంటిపేరు వివాదం ఏమిటీ, పరువు నష్టం దావా ఎవరు వేశారు, రెండేళ్ల జైలు శిక్షపై రాహుల్ గాంధీ ఏమన్నారు ?

ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది లోక్‌సభ సెక్రటేరియెట్‌. పరువు నష్టం దావా కేసులో నిన్న (గురువారం) ఆయనకు సూరత్‌ కోర్టు రెండేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Rahul Gandhi

New Delhi, Mar 24: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి షాక్‌ తగిలింది. ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది లోక్‌సభ సెక్రటేరియెట్‌. పరువు నష్టం దావా కేసులో నిన్న (గురువారం) ఆయనకు సూరత్‌ కోర్టు రెండేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. మోదీ ఇంటి పేరు(Modi surname) కలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష పొందిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ల ప్రకారం.. ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియెట్‌ ప్రకటించింది. 2019 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ కేరళ వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా నెగ్గారు. తాజా నిర్ణయంతో ఆయన ఎంపీగా అర్హత కోల్పోయారు.

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, 2019 కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సూరత్‌ కోర్టు

తీర్పుపై అభ్యర్థన పిటిషన్‌కు కోర్టు 30 రోజుల గడువు ఇచ్చినప్పటికీ.. ఈలోపే ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ప్రకటించారు. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 8(3) ప్రకారం.. పార్లమెంట్‌ సభ్యుడు ఎవరికైనా సరే.. ఏదైనా కేసులో రెండేళ్ల కనీస శిక్ష, ఆపై శిక్ష పడితే.. అనర్హత వేటు పడి పదవీ కోల్పోతారు.

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో.. కర్ణాటక కోలార్‌ వద్ద జరిగిన ర్యాలీలో ఆయన ప్రధాని మోదీని టార్గెట్‌ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ పేర్లను సైతం ప్రస్తావిస్తూ.. దేశంలో దొంగల పేర్లన్నీ మోదీ పేరుతోనే ఉన్నాయంటూ..విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ, సూరత్‌ కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగిందంటూ రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు.

సీఎంను, మంత్రులను బూతులు తిడుతున్నా మేము సహిస్తున్నాం, బెంగుళూరులో నటుడు చేతన్ అరెస్ట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్

ఈ కేసులో నాలుగేళ్ల పాటు వాదనలు కొనసాగగా.. గత వారం ఇరు వర్గాల వాదనలు పూర్తి కావడంతో సూరత్‌ కోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. ఇక ఇవాళ(గురువారం) రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ సూరత్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసుకుగానూ స్టేట్‌మెంట్‌ రికార్డు కోసం మధ్యలో 2021 అక్టోబర్‌లో రాహుల్‌ గాంధీ సూరత్‌ కోర్టులో హాజరయ్యారు కూడా.

రాహుల్‌ టార్గెట్‌ చేసుకుంది ప్రధాని నరేంద్ర మోదీని అని, ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీని కాదని, కాబట్టి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని రాహుల్‌ గాంధీ తరపు న్యాయవాది వాదించారు. అయితే చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్‌ వర్మ మాత్రం రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు నేరపూరితమైనవని, పూర్ణేశ్‌ పరువుకు భంగం కలిగించేవని తేల్చి.. రాహుల్‌ గాంధీకి గురువారం రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు.

ఈ కేసులో సూరత్ కోర్ట్ ప్రస్తుతానికి కోర్టు 30 రోజుల బెయిల్ ఇచ్చినా తర్వాత ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాబోతున్నాయి. పై కోర్టులు కనుక సూరత్ కోర్ట్ తీర్పును కొట్టేయకపోతే రాహుల్‌ ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. అయితే సూరత్ కోర్ట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.రాహుల్‌పై సూరత్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై చట్ట ప్రకారం ముందుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మ్లలికార్జున ఖర్గే చెప్పారు. బీజేపీ ఇలా చేస్తుందని తాము ముందే ఊహించామన్నారు. రాహుల్ నోరు నొక్కడానికే ఇలా చేశారని విమర్శించారు.

అటు తన సోదరుడు భయపడే రకం కాదని, భయపడబోడని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ(Congress General Secretary Priyanka Gandhi Vadra) చెప్పారు. నిజం చెప్పడమే అలవాటని, నిజమే చెబుతామన్నారు. రాహుల్ నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్ (Chhattisgarh CM Bhupesh Baghel), రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Rajasthan CM Ashok Gehlot) కూడా బీజేపీ రాహుల్ గొంతు నొక్కే యత్నం చేస్తోందని విమర్శించారు.

మరోవైపు పరువు నష్టం కేసు(defamation case)లో తనకు రెండేళ్ల జైలు శిక్ష పడటంపై రాహుల్ స్పందించారు. సత్యమే తనకు గురువని చెప్పారు. తన ధర్మం సత్యం, అహింసలపై ఆధారపడిందన్నారు.