Rahul Gandhi on PM Modi: భరతమాతపై ఎక్కడ దాడి జరిగినా అక్కడ నేను ఉంటా, మణిపూర్‌లో మనుషులు చస్తుంటే ప్రధాని జోకులేసి నవ్వుతున్నారు,మోదీపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ

మణిపూర్‌ (Manipur) మండుతుంటే ప్రధాని మాత్రం పార్లమెంట్‌ లో జోకులేస్తూ.. నవ్వుతున్నారని మండిపడ్డారు. హింసను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆపలేకపోయాయని ప్రశ్నించారు.

Rahul Gandhi and PM Modi (Photo-ANI)

New Delhi, August 11: భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పై కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్‌ (Manipur) మండుతుంటే ప్రధాని మాత్రం పార్లమెంట్‌ లో జోకులేస్తూ.. నవ్వుతున్నారని మండిపడ్డారు. హింసను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆపలేకపోయాయని ప్రశ్నించారు.

నిన్న లోక్‌సభలో నవ్వుతూ కనిపించిన ప్రధానికి దేశంలో ఏం జరుగుతుందో తెలియదా? అంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ నిలదీశారు. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. తన ప్రసంగంలో ఎక్కువ భాగం విపక్షాల తీరు, ప్రత్యేకించి కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ క్రమంలో ఆయన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్‌ గాంధీ ఇవాళ మీడియా ముందుకు వచ్చారు.

బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు గుడ్ బై, IPC, CRPC స్థానంలో కొత్త చట్టాలకు సంబంధించి లోక్‌సభలో 3 బిల్లులు

నిన్న లోక్‌ సభలో ప్రధాని మోదీ 2 గంటల 13 నిమిషాల పాటు మాట్లాడారు. చివరికి మణిపూర్‌ అంశంపై రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారు. నెలల తరబడి మణిపూర్‌ కాలిపోతోంది. ప్రజలు చనిపోతున్నారు. మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. ప్రధాని మాత్రం నవ్వుతున్నారు. జోకులు పేల్చుతున్నారు. అలాంటి వ్యవహార శైలి ప్రధానికి సరికాదు’ అని రాహుల్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సైన్యానికి అవకాశం ఇస్తే రెండు గంటల్లో మణిపూర్‌ను చక్కదిద్దుతుందని అన్నారు. అయితే, ప్రధాని మణిపూర్‌ను తగలబెట్టాలనుకున్నారు.. అందుకే హింసను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అని రాహుల్‌ ఆరోపించారు.

మణిపూర్‌ హింసపై రాజకీయాలు సిగ్గుచేటు, ప్రతిపక్షాలపై మండిపడిన అమిత్ షా, శాంతి కోసం విజ్ఞప్తి చేసిన కేంద్ర హోం మంత్రి

మణిపూర్‌లో దారుణ పరిస్థితులను చూసి కేంద్ర బలగాలే ఆశ్చర్యపోయాయి. నిప్పుల గుండం లాంటి మణిపూర్‌ను చల్లార్చాల్సింది బోయి బీజేపీ.. మరింత ఆజ్యం పోసింది అని మండిపడ్డారు రాహుల్‌ గాంధీ. ప్రధానిగా మోదీ కనీసం మణిపూర్‌కు వెళ్లాల్సింది. అక్కడి ప్రజలకు నేనున్నా అని భరోసా ఇవ్వాల్సింది. నేను మీ ప్రధాని.. ఎలాంటి సమస్య ఉన్నా కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకుందాం అని అనాల్సింది. కానీ, ఆయనలో అలాంటి ఉద్దేశం ఏం కనిపించడం లేదు. మణిపూర్‌ మంటలు ఆరడం ఆయనకు ఇష్టం లేనట్లుంది అని రాహుల్‌ అన్నారు.

భారత్‌ను హత్య చేశారు అని నేను అనలేదు. మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారు అని ఊరికే అనలేదు. ‘బీజేపీ మణిపూర్‌ను, భారత్‌ను హత్య చేసి.. రెండుగా చీల్చింది’ ఇదీ నేను అన్నమాట. మణిపూర్‌ మండుతుంటే.. ప్రజలు చనిపోతుంటే.. మోదీ మాత్రం నవ్వుతూ పార్లమెంట్‌లో కనిపించారు. మణిపూర్‌ ఇష్యూను తమాషాగా మార్చారు. ప్రధాని స్థానంలో ఉన్న మోదీ.. మణిపూర్‌లో జరుగుతున్న హింసను ఎందుకు ఆపలేకపోయారు?. దేశంలో ఇంత హింస జరుగుతుంటే.. ప్రధాని రెండు గంటలపాటు నవ్వుతూ ఎగతాళి చేశారు. అలాంటి వ్యవహార శైలి మోదీకి సరికాదు.

ఇక్కడ ప్రశ్న 2024లో మోదీ మళ్లీ ప్రధాని అవుతారా? కాదా? అనికాదు.. మణిపూర్‌లో జనాల్ని, పిల్లల్ని ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ప్రధాని అయ్యాక రాజకీయ నాయకుడిగా ఉండడం మానేయాలి. ఆయన దేశ వాణికి ప్రతినిధి అవుతాడు. అలాంటప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి చిల్లర రాజకీయ నాయకుడిలా కాకుండా.. ప్రధాని తన వెనుక ఉన్న భారతీయ ప్రజల గుండెబరువుతో మాట్లాడాలి. కానీ, మోదీ అలాకాకుండా వ్యవహరించడం బాధాకరం. అలాంటి ప్రధాని వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

కాగా మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారని, వీళ్లు దోశద్రోహులే కానీ, దేశభక్తులు కాదని కేంద్రంలోని అధికార బీజేపీని అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఘాటుగా విమర్శించిన సంగతి విదితమే. మీడియాను వాళ్లు (కేంద్రం) అదుపులో పెట్టుకున్నారనే విషయం తనకు తెలుసునని, రాజ్యసభ, లోక్‌సభ టీవీని తమ అదుపులో పెట్టుకున్నారని, అయినప్పటికీ తాను తన పని తాను చేసుకుంటూ పోతానని చెప్పారు. భరతమాతపై ఎక్కడ దాడి జరిగినా అక్కడ తాను ఉంటానని, భరత మాత పరిరక్షణకు కట్టుబడి ఉంటానని రాహుల్ మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.