'All Sacredness Destroyed': లోక్‌సభ నిరవధిక వాయిదా, నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదని కంటతడి పెట్టిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, ప్రతిపక్షాల నిరసనల మధ్య కొనసాగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
సభలో గందరగోళ పరిస్థితులపై (Rajya Sabha Ruckus by Opposition) కంటతడి పెట్టిన వెంకయ్య నాయుడు.. విపక్షాల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న సభలో సభ్యుల ప్రవర్తన కలచివేసిందని, విపక్ష సభ్యులు హంగామా చేసి చర్చను అడ్డుకున్నారని వాపోయారు
New Delhi, August 11: రాజ్యసభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ వెంకయ్య నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. సభలో గందరగోళ పరిస్థితులపై (Rajya Sabha Ruckus by Opposition) కంటతడి పెట్టిన వెంకయ్య నాయుడు.. విపక్షాల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న సభలో సభ్యుల ప్రవర్తన కలచివేసిందని, విపక్ష సభ్యులు హంగామా చేసి చర్చను అడ్డుకున్నారని వాపోయారు. సభలో అలాంటి పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమంటూ కంటతడి పెట్టుకున్నారు.
ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే వెంకయ్య ప్రసంగిస్తూ.. ‘‘ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ ఒక పవిత్రమైన దేవాలయం లాంటిది. కానీ కొందరు సభ్యులు సభలో అమర్యాదగా (All Sacredness Destroyed) ప్రవరించారు. టేబుళ్లపై కూర్చున్నారు. కొందరు టేబుళ్లపై నిల్చున్నారు. పోడియం ఎక్కి నిరసన తెలపడం అంటే గర్భగుడిలో నిరసన తెలిపినట్లే. నిన్నటి పరిణామాలు తలుచుకుంటే నిద్ర పట్టే పరిస్థితి లేదు. చాలా దురదృష్టకరమైన పరిస్థితి’’ అంటూ తీవ్రంగా కలత (Chairman Venkaiah Naidu Breaks Down) చెందారు. సభలో ఇన్ని రోజులు కార్యకలాపాలు స్తంభించడం మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యసభలో మంగళవారం రైతుల సమస్యను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. ఈ అంశంపై చర్చ జరుగుతుండగా కొందరు సభ్యులు నల్లని వస్త్రాలను ఊపుతూ, పత్రాలు విసిరేస్తూ తమ నిరసనలు తెలిపారు. ఒకదశలో చాలా మంది ఎంపీలు సభాపతి స్థానానికి దిగువన పార్లమెంటరీ సిబ్బంది కూర్చొనే చోట టేబుళ్లపైకెక్కి నిల్చొన్నారు. మరికొందరు వాటిపై దాదాపు గంటన్నరసేపు బైఠాయించారు. ఇంకొందరు వీటి చుట్టూ చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిచ్చారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది.
కొద్ది రోజుల నుంచి కూడా ఎంపీలు ఇదే తీరును ప్రదర్శించారు. ఆప్, కాంగ్రెస్ సభ్యులు పోడియం ఎదుట టేబుట్‌పైకి ఎక్కి ఆందోళన చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఏకంగా చైర్మన్ సీటుపైకి ఫైల్స్ విసిరేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర కలత చెంది బుధవారం గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘చైర్మన్ పోడియం దేవాలయ గర్భగుడి లాంటిది. భక్తులు గర్భగుడి వరకు రావచ్చుకానీ లోపలకు రాకూడదు. ఇలాంటి ఘటనలు తరచూ జరగడం ఆవేదన కలిగించే విషయం. నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.’’ అంటూ సభ్యులకు వెంకయ్య నాయుడు హితవు చెప్పారు.
విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 వరకు సమావేశాలు జరగాల్సి ఉండగా.. రెండు రోజుల ముందే లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. వర్షాకాల సమావేశాల్లో భాగంగా 17 రోజుల పాటు లోక్‌సభ సమావేశాలు కొనసాగాయి. ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో చర్చలకు ఆస్కారం లేనందున సభను ముందుగానే నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా నేడు ప్రకటించారు. ఇప్పటికే పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా నిరసనల నడుమే వాటిని సభ ఆమోదించింది.